- ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవు.
- సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది.
- కార్మికులెవరూ సమస్యలపై ఇంత వరకు నన్ను కలవలేదు.
- ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఈ నెల ఏడో తేది నుంచి సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెపై పునరాలోచించాలని కోరారు.బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.ప్రస్తుత సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవని మంత్రి స్పష్టం చేశారు.ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పూర్తిగా సానుకూలంగా ఉందన్న ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎంతో కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.తాను రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కార్మికులు తనను కలవలేదని మంత్రి పేర్కొన్నారు.నేరుగా లేబర్ కమిషన్‌ను కలిసి నోటీసు ఇచ్చారని తెలిపారు.ఉద్యమకారుడిగా తనకు ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.కార్మికులతో సమాలోచనలకు తాను సిద్ధంగా ఉన్నట్లు పొన్నం స్పష్టం చేశారు.గత పదేండ్లుగా ఆర్టీసీ అభివృద్ధిలో నిలకడగా నడవలేదని చెప్పారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని బకాయిలను విడుదల చేస్తోందని మంత్రి వివరించారు.ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తోందన్నారు.అదే సమయంలో ప్రభుత్వమూ సంస్థ పునరుద్ధరణ కోసం గట్టి చర్యలు తీసుకుంటోందని అన్నారు.