- 92.78 శాతం ఉత్తీర్ణత నమోదు.
- గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదు.
- 91.32 శాతం బాలురు.. 94.26 శాతం బాలికలు.
- జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.
- 99.29 శాతం అగ్రస్థానంలో మహబూబాబాద్ జిల్లా.
- చివరి స్థానంలో 73.97 శాతం ఉత్తీర్ణతో వికారాబాద్ జిల్లా.
- జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు బుధవారం రవీంద్రభారతిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం ఫలితాల్లో గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉత్తీర్ణత నమోదు అయింది. ఈ ఏడాది 4,629 స్కూల్స్ 100 శాంత ఉత్తీర్ణత సాధించగా ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు రెండు ఉన్నాయి. ఈసారి ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా 99.29 శాతంతో అగ్రస్థానంలో నిలువగా, వికారాబాద్ జిల్లా 73.97 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. ఈ సారి జీపీఏ విధానం తొలగించి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్ల విధానం తీసుకువచ్చారు. కనీస మార్కులు వస్తే పాస్ లేదంటే ఫెయిల్ అని మార్కుల మెమోపై నమోదు చేశారు.
- జూన్ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.
జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు మే 16 వరకు గడువు ఇచ్చింది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు మే 15 వరకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుకు రూ. 500 చెల్లించి రీ కౌంటింగ్, సబ్జెక్టుకు రూ. వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
- నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో పనిచేస్తున్నాం – సీఎం రేవంత్ రెడ్డి.
దేశంలో సమూలమైన మార్పు రావాలంటే ప్రతి వారికీ నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి శ మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రైవేటు సంస్థలకన్నా మెరుగైన ఫలితాలు సాధించడం పట్ల సిబ్బందిని, అధ్యాపకులను, విద్యార్థులను అభినందించారు.ప్రైవేటుకన్నా ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించడం ప్రజా ప్రభుత్వం పనితీరుకు గీటురాయి అని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని బలంగా విశ్వసిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్ రావు తో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
