మోడీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి కార్మిక–కర్షక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి : కొండమడుగు నర్సింహ్మ
మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ను, వి.బి – జి రామ్ జి చట్టాన్ని, విద్యుత్ సవరణ బిల్లును, విత్తన చట్టాన్ని వెంటనే విరమించుకోవాలి…
కార్మిక, కర్షిక వర్గంపై కేంద్ర బిజెపి ప్రభుత్వ దాడిని తిప్పి కొట్టండి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
ముద్ర ప్రతినిధి, భువనగిరి
మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లను, వి.బి- జి రామ్ జి చట్టాన్ని, విద్యుత్ సవరణ బిల్లును, విత్తన చట్టాన్ని వెంటనే విరమించుకోవాలని, రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు. కార్మిక, కర్షక వర్గంపై కేంద్ర బిజెపి ప్రభుత్వ దాడిని కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు సంఘటితంగా ఐక్యంగా తిప్పికొట్టాలని వారు పిలుపునిచ్చారు. గురువారం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కూలీ సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భూదాన్ పోచంపల్లి పట్టణంలో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుండి పట్టణంలోని భువనగిరి చౌరస్తా వరకు వందలాదిమంది కార్మికులు మోడీ విధానాలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించి రెండు గంటలపాటు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు మండల కన్వీనర్ మంచాల మధు అధ్యక్షత వహించగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ 1992 నుంచి సరళీకరణ, ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక విధానాలు అమలైతున్నప్పటి నుండి అన్ని వర్గాలపైన రోజు రోజుకు భారాలు పెరుగుకుంటా వచ్చాయని అన్నారు. గత పది సంవత్సరాల మోడీ పాలనలో సంస్కరణలు వేగవంతంగా అమలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ అన్ని వర్గాలపై భారాలు మోపుతూ ప్రజల బతుకులను చిందర బందరు చేశారని విమర్శించారు. కార్పొరేట్ల ఒత్తిడితో కార్మిక వర్గానికి ప్రాథమిక హక్కులు లేకుండా చేసే 4 లేబర్ కోడ్స్‌ను కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. దీనితో సంఘం పెట్టుకొనే హక్కు, సమ్మె చేసే హక్కు, బేరసారాలాడే ప్రాథమిక హక్కులు కూడా లేకుండా కార్మికులు కోల్పోతారని ఆవేదన వెలిబుచ్చారు. బ్రిటిష్ కాలంలో లాగే కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడిందని అన్నారు. భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్‌పరం చేయడం, ఇన్సూరెన్స్, బ్యాకింగ్, పరిశ్రమల్లో సంస్కరణలు అమలు చేయడానికి దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి పది మంది బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికే కేంద్ర బిజెపి ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ తెచ్చింది అన్నారు. ప్రభుత్వ రంగంలోని భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్నదని అన్నారు. భారతదేశం నేటికీ వ్యవసాయ దేశమని 60 శాతానికి పైగా ప్రజలు ఉపాధికి వ్యవసాయంపై ఆధారపడి అతి తక్కువ ఆదాయాలతో బతుకుతున్నారని తెలిపారు. ఇప్పకి రైతాంగానికి గిట్టుబాటు ధర లేదని ఈ పరిస్థితులలో విద్యుత్ సవరణ బిల్లుతెచ్చి సబ్సిడీలను తగ్గించాలని చూస్తుందని విమర్శించారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం ద్వారా లభించిన హక్కుకు రక్షణ లేకుండా చేసి కొత్తగా వి.బి- జి రామ్ జి చట్టం తెచ్చారని విమర్శించారు. ఈ చట్టంలో 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయం చేయడమంటే క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకుండా చేయాలని కుట్ర బీజేపీ చేస్తుందని విమర్శించారు. భారతదేశంలో కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని బానిసలుగా మార్చి జలగల్లా రక్తాన్ని పీల్చడానికే ట్రంప్ టారిఫ్‌లు వచ్చాయని అన్నారు. భారత దేశాన్ని బలహీనం చేసి సార్వభౌమత్వాన్ని దెబ్బ తీస్తున్నదని మన దేశం క్రూడాయిల్ ఎక్కడ కొనాలో అమెరికాయే ఆదేశిస్తున్నదని విమర్శించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికా కార్పొరేట్ వ్యవసాయానికి బార్లు తెరిచి వారి యొక్క పంటలు, పాలు, పత్తి, సోయాబీన్, ఆయిల్ ఎక్కువగా మన దేశంలో అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే మన రైతాంగం దివాలాదీసి మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురవుతాయని అన్నారు. ఇలాంటి మోడీ మోదనాష్టపు విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల శ్రామిక ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ప్రసాదం విష్ణు, సిఐటియు పట్టణ కన్వీనర్ వడ్డేపల్లి యాదగిరి పాల్గొని మాట్లాడగా ఇంకా రైతు సంఘం జిల్లా నాయకులు పగిళ్ల లింగారెడ్డి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ బాబు, ఉపేందర్, అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాల్లు జంగమ్మ, వసంత, శ్రీ సాయి మెటల్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసింహ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ముత్తమ్మ, మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ నాయకురాలు భూలక్ష్మి, లక్ష్మి, మద్దతుగా పాల్గొన్న సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు బుగ్గ లక్ష్మయ్య, పోన్నమోని కృష్ణ, మండల నాయకులు కోట అశోక్, కోట రమేష్, కోట భూపాల్ రెడ్డి, సలీం, రుక్మిణి, వెంకటమ్మ, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.