Take a fresh look at your lifestyle.

కార్పొరేట్ ప్రయోజనాల కోసమే 4 లేబర్ కొడ్లు.. లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలి : ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కార్పొరేట్ ప్రయోజనాల కోసo కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా భువనగిరిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా లేబర్ కోడ్లను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నదని, ఈ కోడ్ల వల్ల పని గంటలు 8 నుండి 12 గంటలకు పెరగడం, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోవడం, ఉద్యోగ భద్రత లేకపోవడం, కార్మికునికి ప్రమాదం జరిగితే ఎలాంటి బెనిఫిట్స్ రాకపోవడం, యూనియన్ల హక్కులు క్షీణించడం వంటి సమస్యలు ఏర్పడతాయని, కార్మికులకు కనీస వేతన హామీ, సామాజిక భద్రత, పెన్షన్ హక్కులు వంటి అంశాలు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకుని కార్మిక సంఘాలతో చర్చించి అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్ నాయకులు పిన్నం జగన్, గౌరవంతల శ్రీనివాస్, ఎర్ర బాబు, రవి, కుమార స్వామి, అరుణ్, జహంగీర్, మైసయ్య, కరీం, నాయక్, కరుణాకర్, వెంకటేష్, మల్లేశం, నర్సింహా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.