ముద్ర సంగారెడ్డి,మార్చి:
జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర,గ్రావెల్ రవాణాను కట్టుదిట్టంగా నియంత్రించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.వాల్టా చట్టంతో పాటు మోటార్ వాహనాల చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
శనివారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవెన్యూ, పోలీస్,మైనింగ్,భూగర్భజల శాఖ అధికారులతో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా నివారణపై చర్చించారు. జిల్లాలో వాల్టా చట్టం అమలు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అవగాహన,భూభారతి దరఖాస్తుల పరిష్కారం, ఎస్‌ఐఆర్ నమోదు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలో ఇసుక,కంకర అక్రమ రవాణాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ,పోలీస్,మైనింగ్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమ రవాణాలో పాల్గొనే వాహనాలను సీజ్ చేసి మోటార్ వాహనాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఫిల్టర్ సాండ్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సహజ ఇసుకకు బదులుగా కృత్రిమంగా ఇసుక తయారు చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఇసుకను నిర్ణీత ధరలకే అందిస్తోందని, దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.నారాయణఖేడ్, జోగిపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ల ద్వారా ఇసుకను నిర్ణీత ధరలలో అందిస్తున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లాలో ఇసుక కొరత లేదని స్పష్టం చేసిన కలెక్టర్,కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణాలకు అవసరమైన ఇసుక,గ్రావెల్ వినియోగానికి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని సూచించారు.
మొరం, గ్రావెల్ తవ్వకాలపై సాంకేతికంగా తనిఖీలు నిర్వహించి తవ్వకాల వివరాలు పరిశీలించాలని తెలిపారు.ఇప్పటివరకు నమోదు చేసిన అక్రమ రవాణా కేసుల వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.కుల,ఆదాయ, నివాస ధృవపత్రాల జారీ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పై మండల,గ్రామ స్థాయిలలో విస్తృత ప్రచారం నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని తెలిపారు.గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, జిల్లా భూగర్భ శాఖ అధికారి ఎం.రఘుబాబు,రెవెన్యూ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.