ముద్ర, శేరిలింగంపల్లి:
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన హాజరుకాగా, గౌరవ అతిథులుగా ‘సేవ్’ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు విజయ్ రామ్, ప్రముఖ పోషకాహార నిపుణులు, మనస్తత్వవేత్త డాక్టర్ నిదా ఫాతిమా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, వివిధ విభాగాల డీసీపీలు, పోలీస్ అధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్, జీహెచ్ఎంసీ అధికారులు, రైతులు మరియు వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

‘గివ్ టూ గైన్’ థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా శక్తిని గౌరవించడం, సమాజంలో వారి పాత్రను గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. సమాజంలో సానుకూల మార్పులకు మహిళా సాధికారత ఎంతో కీలకమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
లక్ష్యసాధనకు క్రమశిక్షణే మార్గం.. సీఎంసీ కమీషనర్ సృజన
ఏ రంగంలోనైనా రాణించాలంటే క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యం మరియు నిరంతర కృషి అవసరమని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలనే తపన తనలో ఉండేదని, తన తండ్రి బాలరామయ్య స్ఫూర్తితోనే సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన తాను, క్రమబద్ధమైన ప్రణాళికతో చదివి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో దేశవ్యాప్తంగా 44వ ర్యాంక్ సాధించినట్లు వివరించారు. యువత తమపై తాము నమ్మకం ఉంచి, కష్టపడి చదివితే ఎలాంటి కఠినమైన లక్ష్యనైనా సులభంగా సాధించవచ్చని ఆమె ఈ సందర్భంగా సూచించారు.

రసాయన రహిత సాగుతోనే ఆరోగ్యం..
రసాయనాలపై ఆధారపడిన వ్యవసాయం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ‘సేవ్’ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు విజయ రామ్ అన్నారు. పాతకాలపు సహజ వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారానే భూమిని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందవచ్చని సూచించారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త సుభాష్ పాలేకర్ రూపొందించిన సహజ సిద్ధమైన విధానాలను పాటిస్తే.. రైతులు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ముఖ్యంగా కులాకర్ వంటి సంప్రదాయ బియ్యం రకాల్లో అధిక పోషక విలువలు ఉంటాయని, ఇవి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. ప్రజలందరూ రసాయన రహిత ఆహారాన్ని తీసుకోవాలని, రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, సహజ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులకు, ప్రజలకు హైదరాబాద్‌లో ఏడాది పొడవునా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ .. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. మహిళల ఆరోగ్యం, భద్రత, విద్య , ఆర్థిక స్వాలంబన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
శారీరక, మానసిక సమతుల్యతతో సంపూర్ణ ఆరోగ్యం: డాక్టర్ నిదా ఫాతిమా
ప్రముఖ పోషకాహార నిపుణులు, మనస్తత్వవేత్త డాక్టర్ నిదా ఫాతిమా మాట్లాడుతూ, ఆరోగ్యం అంటే కేవలం మనం తీసుకునే పోషకాహారం మాత్రమే కాదని, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. మనం తీసుకునే ఆహారం కేవలం శారీరక శక్తికే కాకుండా, మన ఆలోచనలను మరియు ఒత్తిడిని నియంత్రించే మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుందని ఆమె వివరించారు. పోషక విలువలున్న ఆహారమే మానసిక ప్రశాంతతకు పునాది అని, ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించడానికి పోషణ, మనస్తత్వ శాస్త్రం రెండూ సమన్వయంతో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్‌లో పరిశోధనలు చేసిన డాక్టర్ నిదా, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఆహారపు అలవాట్లపై అవగాహన పెంచుకోవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను ఎలా అడ్డుకోవచ్చో వివరించారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న ‘న్యూట్రిషన్ అండ్ బియాండ్’ సంస్థ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అలవర్చుకోవాలో మార్గనిర్దేశం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
చైల్డ్ అండ్ అడోలెసెంట్ సైకియాట్రిస్ట్ కన్సల్టెంట్ హరిణి మాట్లాడుతూ.. పిల్లలు కౌమారదశలో ఉన్నవారి మానసిక ఆరోగ్యం, వారి వికాసం కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
కార్యక్రమం ముగింపులో, విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళా అధికారులను, సిబ్బందిని మరియు పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న మియాపూర్, పటాన్‌చెరు, నిజాంపేట్, మరియు మాదాపూర్ ప్రాంతాల మహిళా పారిశుధ్య కార్మికులను వేదికపై ప్రత్యేకంగా సన్మానించి, వారికి జ్ఞాపికలను అందజేశారు.
ఈ వేడుకలో భాగంగా పలువురు నిపుణులు, కళాకారులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మార్చారు. ఏఎస్‌ఐ కె. వనజ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమం అందరినీ అలరించింది. అలాగే, శ్రీలత, శ్రీకృష్ణల గీతాలాపన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మహిళా సాధికారతకు ప్రతిబింబం ఎక్స్ పో..
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎక్స్ పో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రదర్శనలో మహిళలకు సంబంధించిన రకరకాల దుస్తులు, చేనేత వస్త్రాలు, అలంకరణ వస్తువులు మరియు పోషక విలువలున్న ఆహార పదార్థాల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసుల ఆరోగ్య సంరక్షణ కోసం తృణ ధాన్యాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం పలు రకాల గృహోపకరణాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన పట్ల పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు మరియు సందర్శకులు విశేష ఆసక్తి కనబర్చారు.
స్టాల్స్ బాగున్నాయి: నాగరాజు, ఏఆర్ పీసీ
ఈరోజు ఏర్పాటు చేసిన స్టాల్స్ బాగున్నాయి. అన్ని రకాల వస్తువులు ఒకే వద్ద దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు నాకు నచ్చాయి.
సొందర్య, ఆర్ఎస్ఐ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు సైబరాబాద్ సీపీ ఆఫీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉత్పత్తులు, జ్యువెలరీ బాగున్నాయి.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటి రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ సిహెచ్. శ్రీనివాస్, అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర, డబ్ల్యూ అండ్ సీఎస్‌డబ్ల్యూ డీసీపీ సృజన కరణం, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్, ట్రాఫిక్-I డీసీపీ రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్-II డీసీపీ ఎస్. శేషాద్రిని రెడ్డి, ఏడీసీపీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.