గత ప్రభుత్వ పాలనలో ‘మా తండాలో మా రాజ్యం’
కాంగ్రెస్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వలేకపోతోంది
సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.వంద కోట్లు ప్రకటన ఉత్తదే
ముద్ర, నారాయణపేట :
తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తమ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.వేల కోట్లు ఇచ్చామన్న హరీశ్‌రావు ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థులకు కనీసం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని తిమ్మారెడ్డి పల్లి, కొత్తపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంత్ సేవాలాల్ కార్పొరేషన్‌కు రూ.వంద కోట్లు ప్రకటించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఎస్టీల ఓట్లు కావాలిగానీ, వాళ్ల సంక్షేమం పట్టించుకోరా?అని ప్రశ్నించారు. కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేశామని బడాయి మాటలు చెబుతున్నారని విమర్శించారు.దశాబ్దాల కాలంగా గిరిజనులు కలలుగన్న “మా తండాలో మా రాజ్యం” నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ మాత్రమేనని హరీష్ రావు గుర్తు చేశారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పట్టించుకోని 3,100 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆయన పేర్కొన్నారు. విద్య , ఉద్యోగాల్లో గిరిజనుల రిజర్వేషన్లను ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచడంతో నేడు వేలాది మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా ఉన్నత పదవుల్లో స్థిరపడుతున్నారని ఆయన వివరించారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి, నిధులు కేటాయించి ఊరూరా ఘనంగా నిర్వహించేలా చేశామన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ 6 లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు వారికి రైతుబంధు, రైతు బీమా వంటి సౌకర్యాలను కల్పించారని హరీష్ రావు తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో లంబాడాలకు కనీసం మంత్రి పదవి కూడా లేదని, గిరిజనులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని కాంగ్రెస్ గాలికొదిలేసిందని, ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు అయ్యాయని ఆయన మండిపడ్డారు. కొత్తపల్లి ప్రాంతంలో రూ. 8 కోట్లతో బ్రిడ్జిని నిర్మించడంతో పాటు, రూ. 50 లక్షలతో బంజారా భవనాన్ని, బావోజీ మహారాజ్ దేవాలయ అభివృద్ధికి రూ. 80 లక్షల నిధులను మంజూరు చేయించినట్లు ఆయన గుర్తు చేశారు.