మృతుల్లో తండ్రి, కొడుకు, అల్లుడు ,ప్రమాద స్థలం సందర్శించిన ఎస్పీ
ముద్ర ప్రతినిధి, మెదక్:
బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన శనివారం సాయంత్రం మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ శివారులో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం… హవేలీ ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (50), అతని కుమారుడు రిషి వర్ధన్ గౌడ్ (12), కూతురును ఇచ్చిన బి. భూపతిపూర్ గ్రామానికి చెందిన అల్లుడు సాయాగౌడ్ (35)లు కుల్చారం మండలం రంగంపేట గ్రామంలో జరిగిన తమ బంధువు ఇంట్లో తొట్టెల కార్యక్రమానికి హాజరయ్యారు.

అనంతరం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మెదక్-హైదరాబాద్ 765డి జాతీయ రహదారిపై రాంపూర్ శివారులో మెదక్ వైపు నుంచి నర్సాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బంధువుల ఫిర్యాదు మేరకు కొల్చారం ఎస్ఐ మొహమ్మద్ మోహినుద్దీన్ కేసు నమోదు చేసి, మృతదేహాలను మెదక్ జిల్లా ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. బూరుగుపల్లి, బి. భూపతిపూర్ గ్రామాల్లో విషాదం అలుముకుంది.
పరిశీలించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు రాంపూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన స్థలాన్ని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మెదక్ -నర్సాపూర్ -సికింద్రాబాద్ జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంట రూరల్ సీఐ జర్జీ, ఎస్ఐ సత్యనారాయణ, మోహినుద్దీన్, ఆర్టీసి డిఎం సురేఖ ఉన్నారు.