- జూబ్లీహిల్స్ స్థానం ఖాళీ అయినట్టు ఈసీకి గెజిట్.
- ఉప ఎన్నిక ఎప్పుడైనా ఉండవచ్చు.
- ఈసారి ఎన్నికల్లో చాలా సంస్కరణలు.
- సీఈవో సుదర్శన్‌రెడ్డి .
ముద్ర, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు రాష్ట్ర అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని సీఈవో సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చాలా సంస్కరణలను తీసుకువస్తోందని తెలిపారు.బీఎల్ఓ, బూత్ లెవెల్ ఏజెంట్స్, ఈఆర్ఓలతో ఇంటరాక్ట్ కార్యక్రమాలు చేపడుతోందని, బీఎల్ఏ, బీఎల్ఓలకు ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. పోలింగ్ స్టేషన్‌లలో మినిమం ఓటర్ల సంఖ్యను 1200కు కుదించిందని గుర్తుచేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆంక్షలను 200 మీటర్ల నుంచి కిలో మీటర్ వరకు పెంచిందని వెల్లడించారు. పోలింగ్ కేంద్రానికి కిలోమీటర్ వరకు పార్టీలు ప్రచారం చేయడానికి వీలు లేదని సీఈఓ సుదర్శన్ రెడ్డి అన్నారు. పోలింగ్ సెంటర్స్ వద్ద ఇక నుంచి మొబైల్ ఫోన్స్ కోసం డిపాజిట్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నెల26, 27 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర బీఎల్ఏ, బీఎల్ఓలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇస్తోందని, నేషనల్ లెవెల్ లీగల్ కాన్ఫరెన్స్ కోసం ముగ్గురు న్యాయవాదులకు శిక్షణ ఇస్తోందని అన్నారు.రూరల్‌లో 87శాతం, అర్బన్‌లో 67శాతం ఓటర్, ఆధార్ కార్డ్ లింక్ జరిగిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
- ఎప్పుడైనా ఉండొచ్చు.
రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే వచ్చిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడే ఉండకపోవచ్చని తెలిపారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ తమకు గెజిట్ పంపించిందని గుర్తుచేశారు. ఆ గెజిట్ తాము యథాతథంగా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని అన్నారు. జూబ్లీహిల్స్‌లో డిసెంబర్ వరకు కొత్త ఎమ్మెల్యే ఎన్నిక జరగాలని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు.
- అక్టోబర్‌లో ఉప ఎన్నిక..?
కాగా, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో షెడ్యూల్ విడుదల కానుండగా, ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది, బల్దియా పనులను వేగవంతం చేసింది. నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, భద్రత కోసం కేంద్ర బలగాలను వినియోగించనున్నారు.త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనితో పాటు మరో ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయ్యింది.
తాజాగా ఈసీకి ఇచ్చిన నివేదిక ప్రకారం అక్టోబర్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో షెడ్యూల్ విడుదల చేస్తారని సమాచారం. ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించే ఎన్నికలు కావడంతో..జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం వీటి నిర్వహణ బాధ్యతలను చేపట్టనుంది. ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం.. జీహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేయడంతో.. బల్డియా ఉప ఎన్నిక పనులను వేగవంతం చేసింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 3,89,954 ఓటర్లు ఉన్నారు. అయితే ఉప ఎన్నిక నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక త్వరలోనే ఈ నియోజకవర్గం పరిధిలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి నామినేషన్ల చివరి రోజు వరకు కొత్త ఓటర్లను నమోదు చేయనున్నారని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఈవీఎంలు, వాటి భద్రత వంటి అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 500 ఈవీఎంలు అవసరం ఉంది. అయితే ఇప్పటికే జీహెచ్ఎంసీ 1000 వరకు ఈవీఎంలను సిద్ధం చేసింది.ఇక ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా..అందుకు తాము సిద్దంగా ఉన్నామని జీహెచ్ఎంసీ ఎన్నికల సంఘానికి తెలిపింది.