Take a fresh look at your lifestyle.

జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా ఆన్లైన్ లో : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లాలో ఇసుక సరఫరా పూర్తిగా మన ఇసుక వాహనం ( ఎం ఐ వి ) ద్వారా ఆన్లైన్ లో ఇందిరమ్మ ఇళ్లకు, స్వంత ఇంటి అవసరాలకు, ప్రభుత్వ పనుల నిమిత్తం బుకింగ్ చేసుకొని పొందగలరని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన లో తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో (7) ఇసుక రీచులను గుర్తించడం జరిగిందని రీచులు గుండాల, అడ్డగూడూరు, మోత్కూరు మరియు మోటకొండూరు మండలాలలో కలవని తెలిపారు. ఇసుక బుకింగ్, సరఫరా ఆన్లైన్ విధానం లో జరగాలని, మాన్యువల్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం, జిల్లాలో ఇసుక సరఫరాకు ఆన్లైన్ విధానం ద్వారానే రూపొందించడం జరిగిందని తెలిపారు. మీ సేవ లేదా ఇంటర్నెట్ షాపుల నుంచి www.manaisukavahanam.com వెబ్సైట్ ద్వారా, స్మార్ట్ ఫోన్ నుంచి మన ఇసుక వాహనం మొబైల్ యాప్ ద్వారా ఇసుక అవసరం ఉన్న వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని పొందవచ్చనారు. ఈ సందర్భంగా ఇసుక అక్రమ రవాణా ను అరికట్టేందుకు మ్యానువల్ విధానానికి నిషేధిస్తూ జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ ద్వారా ఇసుక బుకింగ్, రవాణా జరిగేలా మన ఇసుక వాహనం ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. దీనివల్ల ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం ఉండదన్నారు.
ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా ఇసుక సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, స్వంత ఇంటి నిర్మాణం కొరకు మరియు ప్రభుత్వ నిర్మాణాలలో అవసరమైన ఇసుకను మన ఇసుక వాహనం ( ఎం ఐ వి ) ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకొని పొందగలరని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణం కొరకు ఇసుకను ఎలాంటి చార్జీలు లేకుండా ఉచితంగా పొందవచ్చని తెలిపారు. సమాచారం ను జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించాలని , సంబంధిత అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.