పెట్టుబడుల ఆకర్శణగా తెలంగాణ టూరిజం పాలసీ -సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
దేశ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప మార్గం పర్యాటకమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివారం జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై అవగాహన పెంపొందించడంతో పాటు పర్యాటక రంగం ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, ప్రాంతీయ అభివృద్ధి, జాతీయ ప్రతిష్ఠ, ప్రకృతి సంరక్షణకు ఎంతో తోడ్పడుతుందని సీఎం ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో తెలంగాణను అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో తెలంగాణ టూరిజం పాలసీ – 2025–30ను ప్రకటించామని తెలిపారు. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహస, వైద్య & వెల్నెస్, పర్యావరణ పర్యాటక రంగాల అభివృద్ధి ద్వారా పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకొచ్చామని గుర్తుచేశారు. సురక్షిత పర్యాటకం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పన, అవకాశాలున్న ప్రాంతాలను ప్రత్యేక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా తెలంగాణ టూరిజం పాలసీని ఆవిష్కరించామని అన్నారు. ప్రసిద్ధి చెందిన స్మారక చిహ్నాలు, చారిత్రక ప్రదేశాలు, పవిత్ర పుణ్యక్షేత్రాల గత వైభవం నుంచి రాష్ట్ర గుర్తింపును ప్రతిబింబించే ఉత్సవాలు, వంటకాలు, హస్తకళల వరకు తెలంగాణ ప్రత్యేకత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.