ఎల్లమ్మబండ ఈద్గా వద్ద ఘనంగా దవాత్-ఏ-ఇఫ్తార్ విందు
ముద్ర కూకట్‌పల్లి :
రంజాన్ మాసం క్రమశిక్షణకు, దైవచింతనకు మరియు మతసామరస్యానికి ప్రతీక అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఈద్గా వద్ద మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దవాత్-ఏ-ఇఫ్తార్’ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరని, ఇక్కడ “గంగా జమునా తెహజీబ్” సంస్కృతి మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, పేద ముస్లిం కుటుంబాలు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మసీదుల మరమ్మతులకు నిధులు, పేదలకు దుస్తుల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు.
కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో కూడిన ప్రార్థనలు సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలను పెంపొందిస్తాయని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు