Take a fresh look at your lifestyle.

20 ఏళ్ల సమస్య పరిష్కారం

  • ఒకే రకం ఎపిక్ నంబర్ల సమస్యకు చెక్.
  • భారత ఎన్నికల సంఘం (ఈసీఐ).

ముద్ర, తెలంగాణ బ్యూరో: ఎన్నికల జాబితాను సరిచేసి, నవీకరించే ప్రయత్నంలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2005 నుంచి కొనసాగుతున్న ఒకే రకం ఎపిక్ (ఎలక్టర్ ఫోటో ఐడెంటిటీ కార్డు) నంబర్ల సమస్యను పరిష్కరించింది. వివిధ ఎన్నికల అధికారులు (ఈఆర్ఓలు) ఒకే సిరీస్‌ను ఉపయోగించడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు ఈసీఐ వర్గాలు తెలిపాయి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు  దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 99 కోట్లకు పైగా ఓటర్ల ఎన్నికల డేటాబేస్‌ను సీఈఓలు, 4123 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఈఆర్ఓలు, 10.50 లక్షల పోలింగ్ స్టేషన్లలో సమీక్షించారు. సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 1000 మంది ఓటర్లు ఉంటారు.ఈ పరిశీలనలో ఒకే రకం ఎపిక్ నంబర్లు చాలా తక్కువగా అంటే సగటున నాలుగు పోలింగ్ స్టేషన్లలో ఒక్కటి చొప్పున కనిపించాయి.ఈ ఒకే రకం ఎపిక్ నంబర్లను కలిగిన ఓటర్లు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో నిజమైన ఓటర్లుగా గుర్తించబడ్డారు.వీరందరికీ కొత్త ఎపిక్ నంబర్లతో కొత్త కార్డులు జారీ చేయబడ్డాయి.

ఈ సమస్య 2005లో ప్రారంభమైనట్లు ఈసీఐ వర్గాలు తెలిపాయి.అప్పట్లో వివిధ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వేర్వేరు ఆల్ఫాన్యూమరిక్ సిరీస్‌లను వికేంద్రీకృత పద్ధతిలో ఉపయోగించాయి.2008లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ సిరీస్‌లను మార్చాల్సి వచ్చింది.ఈ సమయంలో కొన్ని నియోజకవర్గాలు పొరపాటున పాత సిరీస్‌లను కొనసాగించాయి.లేదా టైపోగ్రాఫిక్ లోపాల వల్ల ఇతర నియోజకవర్గాలకు కేటాయించిన సిరీస్‌లను ఉపయోగించాయి.

ప్రతి ఓటరు పేరు తాను సాధారణంగా నివసించే పోలింగ్ స్టేషన్ ఎన్నికల జాబితాలో నమోదవుతుంది.ఒకే రకం ఎపిక్ నంబర్ ఉన్నప్పటికీ, ఎవరూ వేరే పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయలేరు.కాబట్టి, ఈ సమస్య ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఈసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

Leave A Reply

Your email address will not be published.