ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శ్రీ రాముని పేరును రాజకీయాల్లోకి లాగడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాం నాథ్ విమర్శించారు. నిర్మల్ లో విలేకరుల సమావేశంలో రావుల రాంనాథ్ మాట్లాడుతూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం నిర్మల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడుతూ రాముడికి బిజెపిలో సభ్యత్వం ఉన్నదా? దేశ స్వాతంత్ర పోరాటంలో బిజెపి నాయకులు పాల్గొన్నారా? అనటం దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బిజెపి ఎమ్మెల్యేలు ఈ సారి గెలిచారు, మళ్ళీ గెలువరని పిచ్చి కూతలు కూయటం వారి తెలివితక్కువ తనని ఉదాహరణ అన్నారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మెప్పు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం తగదన్నారు.రాముడు ఏ యుగంలో ఉన్నారో మహేష్ కుమార్ కు తెలియదా అని ప్రశ్నించారు. కేవలం మైనారిటీ ఓట్ల కోసం మైనార్టీ జపం చేస్తూ హిందూ సంస్కృతిని చరిత్రను మరిచిపోయి సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. స్వతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ బలిరామ్ హెడ్గేవర్ కాంగ్రెస్ నాయకత్వం లో ఎందరో మంది స్వాతంత్ర సమరయోధులతో కలిసి పోరాటం చేసింది మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బిజెపి కంటే ముందుగా జనసంఘ్ అధ్యక్షులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ కోసం పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసింది కాంగ్రెస్ మరిచిపోయిందా అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బిజెపి కి కంచుకోట ఇప్పుడైనా ఎప్పుడైనా బీజేపీ ఏ ఎన్నికలలోనైనా గెలవడం ఖాయమన్నారు. దమ్ముంటే ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తే ఉమ్మడి జిల్లాలో బిజెపి కాంగ్రెస్ ఏది గెలుస్తుందో తెలుస్తుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన విషయాన్ని మర్చిపోయి కార్యకర్తలను ఉత్తేజ పరచడం కోసం మాట్లాడే మాటలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. అక్రమంగా, అన్యాయంగా అధికారంలోకి రావాలని చూసేవారు నీతులు మాని ఇచ్చిన గ్యారెంటీలు హామీలను నెరవేర్చడం కోసం పనిచేస్తే బాగుంటుందని హితవు పలికారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ జింక సూరి, మాజీ కౌన్సిలర్లు పొడెల్లి గణేష్, నాయకులు పూదరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.