- విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలి.
- ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, మెట్రో,డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి.
- హైదరాబాద్ భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్ గా మారబోతుంది.
- గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ను ఏర్పాటు.
- విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్ కు అనుగూణంగా దాని ఉత్పత్తిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం జుబ్లీహీల్స్ లోని తన నివాసంలో విద్యుత్ శాఖ పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఈ యేడాది రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ 17,162 మెగావాట్లకు చేరుకుందని ముఖ్యమంత్రి కి వివరించారు. గత యేడాది తో పోల్చితే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని చెప్పారు. 2025,26 లో డిమాండ్ 18,138 మెగావాట్లకు, 2034..35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని తెలిపారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం సీఎం అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలన్నారు. రైల్వే లైన్లు, మెట్రో , ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్లు అలాగే కొత్త గా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టి లో ఉంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతుందని వివరించారు.హైదరాబాద్ లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్న ఆయన రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించడంతో పాటు ఫ్యూచర్ సీటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీలులేదని స్పష్టం చేశారు. హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.