Take a fresh look at your lifestyle.

తుది అంకానికి కాళేశ్వరం విచారణ

  • హైదరాబాద్ కు చేరకున్న కమిషన్ ఛైర్మన్ పీవీ ఘోష్.
  • రెండు వారాల పాటు ఇక్కడే.
  • ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా విచారణ.
  • చివరగా ప్రభుత్వ పెద్దలు, కేసీఆర్, హరీశ్, ఈటలను విచారించనున్న పీసీ ఘోష్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల అవకతవకలపై విచారణ తుది అంకానికి చేరుకున్నది.ఈ విచారణ కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. ఇప్పటికే అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులను ప్రశ్నించింది.తాజాగా తుది దశ విచారణ మొదలు పెట్టింది. శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. ఈ నెల 31తో కాళేశ్వరం కమిషన్ గడువు ముగియనుంది. దాంతో ఆలోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.విచారణలో భాగంగా కమిషన్ ఇప్పటికే పలుసార్లు బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన ఈఎన్‌సీలు, చీఫ్ ఇంజినీర్లు, అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది.ఈ క్రమంలో కీలక సాక్ష్యాధారాలను సైతం సేకరించింది.ఈ దఫా మిగిలి ఉన్న అధికారులు, ఇతరులతోపాటు గత ప్రభుత్వ పెద్దలు, కీలక వ్యక్తులను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.కమిషన్ ఓ వైపు నివేదిక సిద్ధం చేస్తూనే మరోవైపు మిగిలిన విచారణ చేపడుతున్నది. బ్యారేజీల విషయంలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది.అందులో గత ప్రభుత్వ పెద్దల వైఫల్యాలను ఆధారాలతో సహా ప్రస్తావించింది.

  • కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ

తుది దశ విచారణలో భాగంగా కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, అప్పటి ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావును ప్రశ్నించనున్నది. ఈ క్రమంలో కేసీఆర్ అమెరికా పర్యటన అంశం తెరపైకి వచ్చింది. అయితే విచారణ కీలక దశలో ఉండగా ఆయన అమెరికా పర్యటన ఉంటుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ పెద్దల తీరును ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆపేక్షించింది. పీసీ ఘోష్ కమిషన్ సైతం త్వరలోనే కేసీఆర్‌ను విచారించనుందనే చర్చ జరుగుతున్నది. విచారణకు పిలుస్తుందా? పిలిస్తే ఆయన హాజరవుతారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే కమిషన్ విచారణకు పిలిచేలోపు ఇక్కడే ఉంటారా లేక అమెరికా టూర్‌కు బయలుదేరే అవకాశాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.మరోవైపు ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

  • 400 పేజీలతో నివేదిక సిద్ధం..?

ఇప్పటికే చేపట్టిన విచారణలో తేలిన అంశాల ఆధారంగా 400 పేజీల నివేదికను కమిషన్ సిద్ధం చేసింది. దాదాపు 90 శాతం రిపోర్టు పూర్తిచేసిన కమిషన్ ఇటీవల నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని మిగిలిన విచారణను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ కోసం 2024 మార్చి 12న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో విచారణ ఆలస్యం అవుతుండటంతో ఇప్పటికే పలుసార్లు కమిషన్ గడవును పొడిగించగా ఈ నెలాఖరుతో గడవు ముగియనుంది.ఈనేపథ్యంలో మరోసారి ప్రభుత్వం కమిషన్ గడవు పొడిగించనున్నట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం విచారణ కీలక దశకు చేరుకున్నది. ఈ దశలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్‌ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నది. ఈ దఫాలోనే వారికి సమన్లు పంపించి విచారణకు రావాలని కోరనుంది. ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించిన క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో బరాజ్‌ల నిర్మాణంలో భాగస్వాములైన నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీలు, చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర ఇంజనీర్లతోపాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించిన కమిషన్‌ కీలక సాక్ష్యాధారాలు సేకరించింది. తుది విచారణలొ భాగొంగా వీటిని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల ముందు ఉంచి ప్రశ్నించనున్నట్టు తెలిసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు దెబ్బతిన్నది. ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ ప్రాజెక్ట్‌లోని పిల్లర్లు కుంగాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని అందుకే ఈ విధంగా కృంగిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించాయి. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ వ్యవహారంపై విచారణ చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చింది.ఇంతలో ఎన్నికలు వచ్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అ నాటి సంఘటనలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకొన్న ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సంబంధిత విభాగాల ఇన్ ఛార్జీలు, గుత్తేదారులను విచారించింది.

Leave A Reply

Your email address will not be published.