Take a fresh look at your lifestyle.

బీజేపీ హిందుత్వ రాజకీయం చేయదు -నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

అభివృద్ధే మా పార్టీ అజెండా
సోనియా.. రేవంత్ కన్న నాకే దగ్గర

ముద్ర, నిజామాబాద్ :

హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. అభివృద్ధే తమ పార్టీ ఎజెండా‌ అన్నారు. సోనియా రేవంత్ కంటే తనకే దగ్గరన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి కాబట్టే తాను కాంగ్రెస్ లోకి వెళ్లలేదన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీ రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడమే బీజేపీ అజెండా అని అర్వింద్ అన్నారు. అవినీతిపరులకు, పార్టీ మారిన వారికి బీజేపి టికెట్ ఇవ్వలేదన్నారు. బీజేపీ కి ప్రజలు ముందు.. పార్టీ సెకండ్ అని ఇదే మా ఎజెండా అన్నారు. స్వచ్చ పాలన కోసం బీజేపీకి ప్రజలు ఓటేయాలని ప్రజలను కోరారు. నిజామాబాదు కార్పొరేషన్ లో బీజేపీ మేయర్ పదవి గెలిస్తే ఏ వర్గానికి, ఓటు బ్యాంక్ కు లొంగకుండా నిజామాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తామని అర్వింద్ నగర ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతిరహిత పాలనను, సుపరిపాలనను అందిస్తామన్నారు. బీజేపీ మేయర్ అభ్యర్థిని ఎవరినేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. మెజారిటీ, మైనార్టీ కాదు అభివృద్ధి ఎజెండా గా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. నిజామాబాదుకు వందే భారత్ తెచ్చే బాధ్యత తనదన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కార్పొరేషన్ కు బకాయి పడ్డ రూ. 8.16 కోట్లు ఎగవేత ధోరణితో ఇంత కాలం చెల్లించలేదన్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ కోసమే అస్తిపన్ను బకాయిలు రూ. 8.16 కోట్లు కట్టాడన్నారు. అంత పెద్ద మొత్తాన్ని కట్టించింది తామేనని అర్వింద్ అన్నారు. ఇన్ని రోజులు కట్టిచ్చేటోళ్లు లేరని, ఇప్పుడు కట్టించేటోళ్లు కక్కించెటోల్లచ్చిండ్రని సెటైర్లు వేశారు. మేయర్ పదవి కోసం ఒక్క రోజులో అంత పెద్ద మొత్తంలో కార్పొరేషన్ కు చెల్లించిన వ్యక్తి రేపు మేయర్ అయితే నిలువు దోపిడీ జరుగుతుందన్నారు. కార్పొరేషన్ లో బహిరంగ దోపిడికి తెరలేపి.. ఇందూరు నగరాన్ని పూర్తిగా దోచుకుంటాడని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ బద్దంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆస్తి పన్ను 17 యేళ్లుగా ఎందుకు చెల్లించలేదో, కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఒక్క రోజులోనే ఎందుకు చెల్లించారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇన్నాళ్లూ లేని డబ్బు ఉన్నట్టుండి ఒకేసారి ఎలా వచ్చాయని ప్రశ్నించిన ఎంపీ… లంకెబిందెలు దొరికాయా..? అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి పోటీ చేసే నైతికత లేదన్నారు. అలాంటి వ్యక్తి రేపు మేయర్ అయితే నిజామాబాదు కార్పొరేషన్ ను శ్రీరాముడే కాపాడాలన్నారు. నైతికత, బాధ్యత లేకుండా ప్రజలకు శఠగోపం పెట్టాలనే నైజం నరేందర్ రెడ్డిదన్నారు. ఇలాంటి వారిని ఓటు ద్వారానే శిక్షించాలని అర్వింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. 19వ డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలన్నారు. ఇలాంటి వారిని గెలిపిస్తే సమస్యలెవరికి చెప్పుకుంటారని ప్రజలను ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.