Take a fresh look at your lifestyle.

ఇంటర్ కేజీబీవీ విద్యార్థినీల ఉత్తమ ప్రతిభ పర్యవేక్షణ పెరిగితే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యం

 

నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:

జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన బాలికలు మెరుగైన ఫలితాలు సాధించడం విద్యా రంగంలో కేజీబీవీల ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది.

జిల్లాలోని 11 కేజీబీవీలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం 509 మంది విద్యార్థినులు హాజరుకాగా, వీరిలో 438 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ద్వితీయ సంవత్సరంలో 86 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఫలితాల్లో 85 మందికి పైగా విద్యార్థినులు 900కు పైగా మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు.

అలాగే ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లాలోని 20 కేజీబీవీల నుంచి 1,024 మంది విద్యార్థినులు హాజరుకాగా, వీరిలో 792 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ప్రథమ సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 150 మందికి పైగా విద్యార్థినులు 400కు పైగా మార్కులు సాధించడం విశేషం.

జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ మరింత మెరుగుపడితే ఉత్తీర్ణత శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామీణ బాలికల విద్యాభివృద్ధిలో కేజీబీవీల పాత్ర రోజురోజుకు బలపడుతోందని అధికారులు తెలిపారు.

అలాగే ఫెయిల్ అయిన విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.