అమరావతి:
కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డి-రెగ్యులేషన్ ఫేజ్–2 విధానాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, అనవసర పర్మిషన్లను తగ్గించడం వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్ ముఖ్యమంత్రి ముందుంచారు. అనంతరం రాష్ట్రానికి చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 800కు పైగా నిబంధనలను 100లోపునకు తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పర్మిషన్లు, లైసెన్సులను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యంగా వ్యవస్థలను మరింత సరళీకరించాలని పేర్కొన్నారు.
అయితే ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో ఎటువంటి రాజీ ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. వేధింపులు లేకుండా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అటవీ చట్టాలను సాధ్యమైనంత మేరకు సరళీకరించాలని కేంద్ర బృందానికి సూచనలు చేశారు.
ఫైర్ సేఫ్టీ విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలను తీసుకురావాలని, డబుల్ లైసెన్సింగ్ విధానాలను తొలగించాలని సీఎం ఆదేశించారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాలం చెల్లుబాటు అయ్యే విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.
డి-రెగ్యులేషన్ ఫేజ్–2ను మే నెలాఖరులోగా అమల్లోకి తీసుకురావాలని, ఇందుకోసం అవసరమైన ఆర్డినెన్సులు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. దరఖాస్తు నుంచి అనుమతుల వరకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలని కూడా ఆదేశించారు. ఫేజ్–2 అమలు తర్వాత పరిశ్రమల అనుమతుల ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న సమయాన్ని 40 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ మాట్లాడుతూ, అనుమతులు, నిబంధనల సడలింపు విషయంలో కేంద్ర ప్రతిపాదనలకంటే రాష్ట్రం మరింత ముందంజలో ఉందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎం చంద్రబాబు “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” స్థానంలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే “స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్” ద్వారా ప్రజలకు సేవలు వేగంగా అందిస్తున్నామని తెలిపారు.
ఫేజ్–3పై కూడా సీఎం ఆసక్తి చూపుతూ, జూన్ నెల నుంచి దానిపై పని చేయనున్నట్లు కేంద్ర బృందం వెల్లడించింది. భవిష్యత్ దశలో టెక్నాలజీ అనుసంధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో డేటా లేక్, రియల్ టైమ్ డేటా, సీఎఫ్‌ఎంఎస్, అవేర్–2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి వ్యవస్థలను వినియోగిస్తున్నట్లు ఆయన వివరించారు.