Take a fresh look at your lifestyle.

ఇప్పుడు కాదు.. 2019లోనే సమస్యలు – నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ ఆనకట్టకు ప్రమాదం

  • డిజైన్లు, డ్రాయింగ్స్​లో తప్పుడు ప్రవాహ అంచనాలు
  • లోపాలను గుర్తించి చెప్తే ప్రభుత్వం వినలేదు
  • కాళేశ్వరం విచారణలో ఎల్​అండ్​టీ వివరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులో డ్రాయింగ్స్​, డిజైన్లలో చాలా లోపాలు ఉన్నాయని, ప్రవాహ అంచనాలు వేయడంలో విఫలమయ్యారని, ఫలితంగా బ్యారేజ్​లకు ప్రమాదం వాటిల్లిందని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్​అండ్​ వెల్లడించింది. మేడిగడ్డ ఆనకట్టలో నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తర్వాత 2019లోనే సమస్యలు వచ్చాయని, వాటిని అప్పుడే పరిష్కరించి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని ఎల్ అండ్ టీ ప్రతినిధులు తెలిపారు. డిజైన్ల, డ్రాయింగ్స్ సమయంలో అంచనా వేసిన ప్రవాహవేగం కంటే ఎక్కువగా ఉండడం వల్లే ఆనకట్ట దిగువ భాగాన సీసీబ్లాకులు, అప్రాన్ దెబ్బతిన్నాయని, సమస్యలు అలాగే కొనసాగుతూ వచ్చి ఆ ప్రభావం ఏడో బ్లాక్​పై పడిందని అభిప్రాయపడ్డారు.

కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ముందు ఎల్ అండ్ టీ ప్రతినిధులు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. నిర్మాణ సమయంలో ఉన్న ప్రాజెక్టు డైరెక్టర్ రామకృష్ణరావు, ప్రస్తుత హైడల్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సురేష్, డీజీఎం రజనీష్​లు గతంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించారు. ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్స్, లోపాల్, కాఫర్ డ్యాం, ఆనకట్ట కుంగడానికి కారణాలు, లోపాలు, వాటికి చేసిన మరమ్మత్తులు, సబ్ కాంట్రాక్టులు, కుంగిన బ్లాక్​ పునరుద్ధరణ తదితర అంశాలపై కమిషన్ వారిని ప్రశ్నించింది. ఈ సందర్భంగా నిర్మాణం, నాణ్యత, బ్లాక్– 7 కుంగుబాటుపై కమిషన్ వరుస ప్రశ్నలు సంధించిది. నిర్మాణంలో నాణ్యత పాటించారా..? అని, నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్– 7 ఎలా కుంగింది, కుంగడానికి కారణాలు ఏంటని కమిషన్‌ నిలదీసింది. డిజైన్స్ అండ్ డ్రాయింగ్‌లో లోపాలు ఉన్నాయని, వాటితో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల 7వ బ్లాక్ కుంగిందని సంస్థ ప్రతినిధులు వివరించారు.

మా తప్పేం లేదు.. అంచనాలు సరిగా లేవు

నీటిపారుదల శాఖ ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్ ప్రకారమే మేడిగడ్డ ఆనకట్ట నిర్మించామని, నిర్మాణ భూమిని దశల వారీగా అప్పగించారని, అందుకు అనుగుణంగా పనులు చేశామని ఎల్​అండ్​టీ ప్రతినిధులు చెప్పారు. డిజైన్​లో అంచనా వేసిన ప్రవాహవేగం కంటే ఎక్కువగా ఉన్నందునే ఆనకట్ట దిగువన అప్రాన్, సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయని, దీంతో నీరు నిల్వ చేసిన మొదటి సీజన్ తర్వాతే మేడిగడ్డ ఆనకట్ట దిగువన సమస్యలు గుర్తించినట్లు తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు తగిన డిజైన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖను పలుమార్లు కోరామని, కానీ మాకు ఇవ్వలేదని, దీంతో ప్రభుత్వం నుంచి వచ్చిన డిజైన్ల ప్రకారమే నిర్మాణం చేసినట్లు ఎల్​అండ్​టీ సంస్థ ప్రతినిధులు వివరించారు.

2019లోనే లోపాలు గుర్తించి చెప్పాం

2019లోనే ఈ ప్రాజెక్టులో లోపాలను గుర్తించామని, దానికి సంబంధించిన నివేదిక నీటిపారుదల శాఖకు ఇచ్చామన్నారు. నాలుగేళ్లు అయినా నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదని, 2019 లోనే లోపాలను పరిష్కరించి ఉంటే మేడిగడ్డ ఆనకట్టకు ఇంత ప్రమాదం వాటిల్లేది కాదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆనకట్టను ప్రారంభించిన తర్వాత నీటిని నిల్వ చేసినప్పటి నుంచి కుంగే వరకు ఆనకట్ట ఎప్పుడూ ఖాళీగా లేదని, ఏడో బ్లాక్​ కుంగే వరకు నీరు నిండే ఉందని చెప్పారు. మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో ఎలాంటి సబ్ కాంట్రాక్టులు ఇవ్వలేదన్న ఎల్ అండ్ టీ ప్రతినిధులు తక్కువ వ్యవధి ఉన్నప్పటికీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదని, పూర్తి నాణ్యతా ప్రమాణాలకు లోబడే నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు.

ఇతర ఆనకట్టలతో పోలిస్తే మేడిగడ్డ పరిస్థితి భిన్నంగా ఉన్నందున కాఫర్ డ్యాంకు సంబంధించి అదనపు డబ్బులు చెల్లించాలని కోరినప్పటికీ నీటిపారుదలశాఖ నుంచి ఎలాంటి ధృవీకరణ, చెల్లింపులు జరగలేదని తెలిపారు. ఆనకట్ట పూర్తి అయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చారని, డిఫెక్ట్ లయబిలిటీ గడువు కూడా పూర్తైందని ఎల్ అండ్ టీ ప్రతినిధులు చెప్పారు. ఆనకట్ట పనుల ప్రారంభం సమయంలో ఎల్ అండ్ టీలో ఉండి నీటిపారుదల శాఖతో సమన్వయం చేసిన అమర్ పాల్ సింగ్​ కొన్ని కారణాలతో బయటకు వెళ్లారని, కొన్ని అంశాలు, లేఅవుట్లను కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణంలో నాణ్యత పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా.. వంద శాతం క్వాలిటీ నిర్మాణం చేశామని ఎల్ అండ్ టి ప్రతినిధులు సమాధానమిచ్చారు. అయితే, కుంగిన బ్లాక్‌ను రిపేర్ చేయొచ్చా అని కమిషన్ ప్రశ్నించగా.. ఎల్​అండ్​టీ నుంచి సరైన సమాధానం రాలేదు. కంపెనీ ప్రతినిధులు విభిన్న సమాధానాలు చెప్పారు.

కాగా, ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాల నుంచి లేబర్‌ సహాయం తీసుకున్నామని, సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలపై తాము కూడా రీసెర్చ్ చేశామని, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాని తెలిపారు. అయితే, కాపర్ డ్యాం కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా?, అడిషనల్ వర్క్ కిందకి వస్తుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. కాంట్రాక్ట్ కిందికే వస్తుందని, కానీ.. కాపర్ డ్యామ్‌ నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్ ప్రకారమే కన్స్ట్రక్షన్ జరిగిందని, మేడిగడ్డ నిర్మాణం పూర్తి అయినట్లు ఇంజనీర్లు కంప్లిషన్ రిపోర్ట్‌ ఇచ్చారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.