Take a fresh look at your lifestyle.

ఎందుకిలా జరిగింది..? గ్రామసభల్లో నిరసనలపై సీఎం రేవంత్​ పోస్టుమార్టం

  • దావోస్​ నుంచి రాగానే మంత్రులతో వాకబు
  • సభల్లో ఎమ్మెల్యేల వ్యాఖ్​యలపై అసంతృప్తి
  • నిరసనల వెనక ప్రతిపక్షాల పాత్రపై ఆరా
  • సీఎంతో ఫోన్లో మాట్లాడిన పలువురు ఎమ్మెల్యేలు
  • పథకాల అమలు విషయంలో ప్రజలు అసహనంతో ఉన్నారని ఆవేదన

ముద్ర, తెలంగాణ బ్యూరో : సంక్షేమ పథకాల అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభల్లో చోటు చేసుకున్న ఆందోళనలు.. వెలుగుచూసిన నిరసనలు.. తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ప్రజల అసంతృప్తికి కారణాల అన్వేషణలో పడింది. జనం స్వచ్చందంగా ఆందోళనలకు దిగారా..లేక వారి వెనక రాజకీయ శక్తులు ఏవైనా ఉన్నాయా..? అనే కోణాల్లో విచారణ ప్రారంభించింది. 13 నెలల ప్రజాపాలన తీరుపై అన్ని వర్గాలూ ప్రభుత్వంపై మంచి అభిప్రాయంతో ఉందని భావిస్తున్న కాంగ్రెస్​ ప్రభుత్వం గ్రామసభల్లో వెలుగుచూసిన ఘటనలతో డోలయమానంలో పడింది. ఈ క్రమంలో గ్రామసభల నిర్వహణతో పాటు ప్రజా పాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇంటలిజెన్స్​ విభాగాన్ని రంగంలో దింపినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

విదేశీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చీ రాగానే గ్రామసభల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో పభల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సభల్లో ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారా..? లేదా..? అని ప్రశ్నించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్​ కార్డులు, పింఛన్లు,ఇతర పథకాలన్నీ వర్తింపజేస్తామని హామీ ఇచ్చినా నమ్మలేకపోవడానికి కారణమేంటనే కోణాల్లో విచారణ చేపట్టారు. అదే సమయంలో ప్రజాపాలన, సమగ్ర కుటుంబ సర్వేలో ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి..? వాటిలో ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేయగలుగుతుంది..? దానికి అవసరమయ్యే నిధుల సమీకరణపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం.

మరోవైపు శుక్రవారం జరిగిన చివరి రోజు సభల తీరును సీఎం ప్రత్యక్ష్యంగా వీక్షించారు. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు,మంత్రులను ప్రజలు నిలదీసిన సంఘటనలపై ఆరా తీశారు. సభల్లో పలువురు ఎమ్మెల్యేలు ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకపోవడం, సహనం కోల్పోయి ప్రవర్తించడాన్ని సీఎం సీరియస్​ గా తీసుకున్నారు. మూడు రోజుల నుంచి గ్రామసభలు జరుగుతుంటే.. అసంతృప్తితో ఉన్న ప్రజలకు భరోసా కల్పించడంలో క్షేత్రస్ధాయి కార్యకర్తలు, నాయకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా..పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్​ రెడ్డికి ఫోన్​ చేసి గ్రామాల్లో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని వివరించే ప్రయత్నం చేయగా.. మీరు, పార్టీ శ్రేణులు వారి అసంతృప్తిని పసిగట్టలేకపోయారా..? అని ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.సభల నిర్వహణ తీరుపై క్షేత్రస్ధాయిలో నివేదికలు తెప్పించుకుని ఆ ఆందోళనల వెనక ఎవరి హస్తముందో తెలుసుకోవడంతో పాటు రాజకీయ ప్రమేయం ఉన్న బాద్యులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు  తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.