ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రముఖ సినీ నిర్మాత, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు నివాసంలో నాలుగో రోజు శుక్రవారం కూడా ఐటీ అధికారులు సోదాలను కొనసాగించారు. ఆయన నిర్మించిన సినిమాలలో వచ్చిన లాభాలపై అధికారులు ఆరా తీశారు. తనిఖీల్లో భాగంగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి ఐటీ అధికారులు తీసుకెళ్ళారు. అక్కడ కూడా ఐటీ అధికారులు సోదాలను నిర్వహించి, ఆర్ధిక లావాదేవీలను పరిశీలించారు. అలాగే దిల్ రాజు సోదరుడు విజయనర్సింహారెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. వీరిద్దరి మధ్య ఇటీవల కాలంలో జరిగిన నగదు లావాదేవీ స్టేట్ మెంట్లను ఐటీ అధికారులు పరిశీలించారు. ఇద్దరి ఇండ్లలోని ఆభరణాలను, కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.