ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
ఆర్టీసీ సమ్మె కాలంలో ఆత్మబలిదానం చేసుకున్న నర్సంపేట డిపో డ్రైవర్ కే. శంకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వస్తున్నారు. అన్ని డిపోల ఉద్యోగుల నుంచి స్వచ్ఛందంగా రూ.300 విరాళం సేకరించాలని నిర్ణయించగా, ఇందుకు సంబంధించి యాజమాన్యం ప్రత్యేక సర్కులర్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ డిపోలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఉద్యోగుల నుంచి భారీ స్పందన లభించింది. ఉద్యోగులు స్వచ్ఛందంగా తమ విరాళాలను సంతకాల రూపంలో తెలియజేస్తూ సంఘీభావం ప్రకటించారు.
కే. శంకర్ కుటుంబానికి అండగా నిలవాలని రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పిలుపునిస్తుండగా, “కార్మికుల కుటుంబం కోసం కార్మికులే అండ” అంటూ ఉద్యోగులు ఐక్యత చాటారు. నాగర్‌కర్నూల్ డిపో ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.