పనులు బాగున్నాయని ప్రశంసలు
పిల్లలకు విద్యాబోధన తీరు, అభివృద్ధి పనులపై ఆరా
అరుట్ల తరహాలోనే హుజుర్ నగర్లోనూ మోడల్ స్కూల్ నిర్మాణం
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను తనిఖీ చేసి లబ్ధిదారులతో మాట్లాడిన శేషాద్రి
(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ అభివృద్ధి పనులను గురువారం ముఖ్యమంత్రి(సీఎంవో) ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ ఎండీ వీపీ గౌతమ్, రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ ఆకునూరి మురళి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) కే చంద్రారెడ్డి, హౌసింగ్ శాఖ పీడీ చంపా నాయక్, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంత రెడ్డి, స్థానిక విద్యా కమిటీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ స్కూళ్లను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పర్యవేక్షణలో అరుట్ల గ్రామంలో మోడల్ స్కూల్ నిర్మాణ పనులను ఒక మోడల్ గా చేపడుతున్నారు. ఈ క్రమంలో మోడల్ స్కూల్ పనులను పరిశీలించడానికి సీఎంవో ప్రిన్సిపాల్ సెక్రెటరీ శేషాద్రి అరుట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ లో కొనసాగుతున్న పనులను పరిశీలించి బాగున్నాయని ప్రశంసించారు. అలాగే ఇక్కడి మోడల్ స్కూల్ అభివృద్ధి పనులు, విద్యా బోధనా, విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై సంబంధిత అధికారులను, స్థానిక గ్రామ విద్యాకమిటి సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శేషాద్రి మాట్లాడుతూ.. అరుట్ల మోడల్ స్కూల్ తరహాలోనే హుజుర్ నగర్-2 బెడ్ హమ్ హౌసింగ్ కాలనీలో మోడల్ స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి నాణ్యమైన విద్యను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే 100 నియోజకవర్గాల్లో మోడల్ స్కూల్స్ నిర్మాణం వేగంగా చేపట్టడం జరుగుతోందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ
ఆరుట్ల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లను సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, ప్రేరేపిత లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణ పనులకు సంబంధించిన మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురావుతున్నాయా? అని ఆరా తీశారు. స్థానిక గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులతో నిర్మాణ వ్యయాన్ని ఎలా తగ్గించాలి?.. లబ్ధిదారులకు అందుబాటులో ఉండి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసే అంశాలపై అధికారులతోనూ శేషాద్రి చర్చించారు.