1951వ దశకంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ప్రజా ఉద్యమ కెరటం “భూదాన్ యజ్ఞం”. స్వాతంత్య్రం అనంతరం ప్రజలలో దేశ భక్తిని, సమానత్వాన్ని చాటి చెప్పడానికి బాగా సహకరించిన సానుకూల సందర్భం. ఇదే స్పూర్తితో భారత దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు దాతృత్వంతో “భూదాన్ యజ్ఞానికి” దానం చేసిన “భూదాన్ భూములు” ఇప్పుడు దానవుల చేతుల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. భూమి లేని నిరుపేద ప్రజలను భూమి యజమానులుగా చేయాలన్న ఆచార్య వినోబా భావే దృఢ సంకల్పం మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఘోర పరాభవానికి గురవుతున్నది. కంచె చేను మేసింది అన్న చందంగా భూదాన్ భూములను సంరక్షించాల్సిన ప్రభుత్వాలు భూదాన్ భూములను ప్రభుత్వ భూములుగా మార్చివేసి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నాయి.
75వ “భూదాన్ డే” వేడుకలు ఆంధ్ర ప్రదేశ్ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో విజయవాడలోని ప్రధాన కార్యాలయములో ఘనముగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఏపీ అధ్యక్షులు ఎన్. రాంబాబు నాయుడు, ఉపాధ్యక్షులు వి. లతా, మహిళా విభాగం కన్వీనర్ దత్త మణి, స్టేట్ సెక్రెటరీస్ ప్రదీప్ దాస్, రాజేంద్ర ప్రసాద్, యూత్ వింగ్ కన్వీనర్ అబ్దుల్ అమీర్ ఖాన్, ఈస్ట్ గోదావరి ప్రెసిడెంట్ పి. వీరబాబు, సర్వోదయ సభ్యులు కోటిబాబు, కిశోరె రాజు, కె. శేషు, ప్రసాద్ రాజు, జ్యోతిర్మయి, సీత మహాలక్ష్మి, పి. రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఏపీ అధ్యక్షులు రాంబాబు నాయుడు ప్రజలందరూ మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ్ ఆశయాలను కొనసాగించాలని, ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.
స్వాతంత్య్రం సిద్దించుకున్న భారతావనిలో ప్రజా జీవనంలో ఆర్ధిక తారతమ్యాలు తొలగిపోవాలంటే భూమి లేని బడుగు బలహీన వర్గాల సామాన్య ప్రజలు భూమి యజమానులుగా మారాలన్న ఏకైక లక్ష్యంతో ఆచార్య వినోబా భావే తలపెట్టిన “భూదాన్ యజ్ఞం” దేశంలోని మూడవ వంతు భూభాగాన్ని కదిలించింది. ఆయన తన పాద యాత్ర ద్వారా వేలాది కిలోమీటర్లు ప్రయాణించి, వందలాది ప్రాంతాలను సందర్శించి, లక్షలాది మంది రైతులను కదిలించి, సుమారు 50 లక్షల ఎకరాల భూములను తన భిక్షాటన ద్వారా సేకరించారు. 1951వ దశకంలో ప్రారంభమై, కొన్ని సంవత్సరాల కాలంపాటు కొనసాగిన “భూదాన్ యజ్ఞం” సామాన్య ప్రజా చైతన్యానికి నూతన శ్రీకారం చుట్టింది.
అయితే ఆచార్య వినోబా గారి కాలంలో పంచబడిన భూదాన్ భూములను కూడా ఇప్పటికీ ప్రభుత్వాలు క్రమబద్దీకరించకపోవడంతోనూ, భూదాన్ భూములపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనూ, స్వయంగా ప్రభుత్వాలే భూదాన్ భూములను స్వాహా చేస్తుండడంతోనూ దీనిని ఆసరాగా చేసుకొని భూబకాసురుల, రియల్ మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. “భూదాన్” లక్ష్యాన్ని, చట్టం యొక్క నిబంధనలను తొక్కుకుంటూ వెళ్లి భూదాన్ భూములను కబ్జా చేస్తున్నారు. వాళ్లకు మేమైనా తక్కువా అంటూ చట్టాలను సంరక్షించాల్సిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా భూదాన్ భూములను దొడ్డి దారుల్లో దక్కించుకునేందుకు తెగబడుతున్నారు. తాజాగా తెలంగాణా రాష్ట్రంలో అత్యంత విలువైన భూదాన్ భూములను దొడ్డి దారిలో పలువురు ఉన్నత అధికారులు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్న వైనం తెలంగాణ హైకోర్ట్ జోక్యంతో వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగులోనికి రాకుండా రాజకీయ నాయకుల కబంద హస్తాల్లోనూ, కబ్జాదారుల కోరల్లోనూ చిక్కుకుపోయిన అనేక సంఘటనలున్నాయి. ఇలా అన్ని విధాలుగా భూదాన్ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. భూదాన్ భూముల సంరక్షణకు నడుము కట్టవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము.