Take a fresh look at your lifestyle.

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష-డీసీపీ క్రైమ్స్ ముత్యంరెడ్డి

 

 

ముద్ర, శేరిలింగంపల్లి :

మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించినట్లు హైదరాబాద్ డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే… దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన షేక్ నసీర్ అలియాస్ అహ్మద్ (35), స్వస్థలం వికార్‌బాద్ జిల్లా, ప్రస్తుతం దుండిగల్ నివాసి, 2021 అక్టోబర్ 29న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఉన్న మైనర్ బాలికను బెదిరించి అపహరించాడు. బాలిక ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె తండ్రి అక్టోబర్ 30న దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రైమ్ నం. 1016/2021గా సెక్షన్ 363 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో నిందితుడు బాలికను ముంబైకు తీసుకెళ్లి సుమారు ఆరు నెలల పాటు ఒక గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 376, 344, 506తో పాటు పోక్సో చట్టం సెక్షన్ లను చేర్చారు.

నిందితుడిని మే 2022న అరెస్ట్ చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి కింది విధంగా శిక్ష విధించింది.

పోక్సో చట్టం ప్రకారం 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా. ఐపీసీ సెక్షన్ 363 కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా,
ఐపీసీ సెక్షన్ 344 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 506 కింద 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా, అదనంగా బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

పోక్సో కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, సాక్ష్యాధారాల సమగ్ర సమర్పణతో నిందితుడికి కఠిన శిక్ష పడేలా కృషి చేసిన దర్యాప్తు అధికారులను డీసీపీ క్రైమ్స్ ముత్యం రెడ్డి అభినందించారు. మహిళలు, బాలికల భద్రతకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.