Take a fresh look at your lifestyle.

అన్నా.. పార్టీ క్యాప్.. కండువా కావాలి

  • ఖమ్మం బిఆర్ఎస్ నేతలకు సామాగ్రి కొరత.

ముద్ర ప్రతినిధి, ఖమ్మం: వరంగల్ లో ఈ నెల 27న జరగనున్న పార్టీ 25 ఏళ్ల వేడుకలు నేపథ్యంలో జరగనున్న బీ(టీ)ఆర్ఎస్ బహిరంగ సభ కు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం సభ సక్సెస్ కోసం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఖమ్మం వచ్చి నేతలకు దిశా, నిర్దేశం చేశారు.జిల్లా వరంగల్ కు సమీపంలో ఉండటం, పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉండడంతో ఖమ్మం పై అగ్ర నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు.సమీపంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు అభిమానులను తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి 30 వేల మంది లక్ష్యం కాగా 40 వేల మంది వచ్చే అవకాశం ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మీడియా కు తెలిపారు.అయితే ఇంత వరకు పార్టీ ప్రచార సామాగ్రి పూర్తి స్థాయిలో నియోజకవర్గాలకు చేరలేదు.సభకు ఎలా రావాలని పార్టీ క్యాడర్ అయోమయానికి గురవుతుంది.పార్టీ జెండాలు, కండువాలు , టోపీలు కోసం నాయకులు కార్యకర్తలు ఖమ్మంలోని పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.రాష్ట్ర పార్టీ నుంచి సామాగ్రి పంపిస్తామని చెప్పారని వాటిని ఇప్పటికే ఇచ్చేసామని ఇక రావని జిల్లా అధ్యక్షుడు తెలియజేస్తున్నారు.ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్ లో 60 డివిజన్లు, రఘునాథ్ పాలెం మండలం ఉండగా వచ్చిన జెండాలు, కండువాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఒక పక్క ఎండలు మండుతున్నాయని టోపీలు లేకుండా సభకు ఎలా రావాలని నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖమ్మం నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు సైతం పార్టీ సామాగ్రి కోసం జిల్లా అధ్యక్షుడిని అడగడం గమనార్హం.

Leave A Reply

Your email address will not be published.