Take a fresh look at your lifestyle.

బాబాసాహెబ్ ఆశయాలను నెరవేర్చడమే నిజమైన నివాళి -మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం, ముద్ర విలేకరి: మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దిన మహనీయులని కొనియాడారు.

వారి పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలిపేందుకు గత బిఅర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. నూతనంగా నిర్మించిన సచివాలయంకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా కేసీఆర్ పెట్టడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తిగా అణగారిన ప్రజలు అభ్యున్నతికి బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా దళితులు అభ్యున్నతి కోసం దళిత బంధు కింద ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. విదేశీ విద్య కింద పేద దళిత విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించడం జరిగింది అన్నారు. కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే దళిత బంధు రూ.10 లక్షలు కాదు. రూ.12 లక్షలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దళిత బంధు పథకంను పూర్తిగా పక్కన పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం గేట్లు మూసి, ప్రజలకు దర్శనాన్ని నిరాకరించిందన్నారు. ఇదే విషయాన్ని బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీయడంతో వెంటనే ప్రభుత్వం గేట్లు తెరచడం జరిగిందన్నారు. బాబాసాహెబ్ ఆశయాల స్ఫూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేవిధంగా పని చేయాలని ఆమె కోరారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను నెరవేర్చినప్పుడే, మనం ఆయనకు ఇచ్చేది నిజమైన నివాళులు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏంఏంసి అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, సిద్దాల బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, ఏనుగు అనిల్ యాదవ్, దీప్ లాల్ చౌహాన్, బిఏంసి బిఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి, మదారి రమేష్, విజయ్, జోజి, మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి గీత, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, పలువురు నాయకులు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.