Take a fresh look at your lifestyle.

మహిళా సాధికారతకు ‘మహాలక్ష్మి పథకం భరోసా కలెక్టర్ రాజర్షి షా

బోథ్, ముద్ర:

మహిళల ఆర్థిక సాధికారత, స్వేచ్చా ప్రయాణం, జీవన ప్రమాణాల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారెంటీలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ఒక విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. ఈ పథకం ప్రారంభం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారు సుమారు 10,000 కోట్ల రూపాయల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్నారని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం కింద సుమారు 2.55 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నరని, ఛార్జీల రూపంలో ఆదిలాబాద్ డిపో 106 కోట్లు, ఉట్నూరు డిపో 28 కోట్ల రూపాయలకు పైగా ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళలు బస్సుల్లో ప్రయాణించడమే కాకుండా, స్వయంగా బస్సులను నడిపేలా జిల్లా సమాఖ్యకు ఆర్టీసీ బస్సులను కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడించారు. పథకం ద్వారా ఆదా అయిన సొమ్మును మహిళలు తమ కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, మెప్మా పిడి రాజు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంలు శ్రీహర్ష, రామయ్య, డిఏం ప్రతిమ, పట్టణ తహసిల్దార్ శ్రీనివాస్, ఆర్టీసీ, ఇతర శాఖల మహిళ ఉద్యోగులు, మహిళా ప్రయాణికులు, ట్రాన్స్ జెండర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.