Take a fresh look at your lifestyle.

సైబర్ నేరాలపై పోలీసుల ఉక్కుపాదం: తొమ్మిది కేసులు ఛేదించి 12 మంది నిందితుల అరెస్టు

ముద్ర, శేరిలింగంపల్లి:
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 2026 జనవరి 30 నుంచి ఫిబ్రవరి ఐదవ తేది వరకు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మొత్తం తొమ్మిది సైబర్ క్రైమ్ కేసులను విజయవంతంగా ఛేదించి, దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 12 మంది నిందితులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్స్ డీసీపీ టి.సాయి మనోహర్ తెలిపారు.

ఈ అరెస్టుల్లో అత్యధికంగా ఏడు అరెస్టులు ట్రేడింగ్ మోసాలకు సంబంధించినవని తెలిపారు. మొత్తం కేసులలో ట్రేడింగ్ ఫ్రాడ్‌, జాబ్ ఫ్రాడ్‌, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్‌, మ్యాట్రిమోనీ ఫ్రాడ్‌ వంటి వివిధ రకాల సైబర్ నేరాలు ఉన్నట్లు వెల్లడించారు. అదే సమయంలో బాధితులకు ఊరట కలిగించే విధంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ 58 కేసుల్లో 406 రిఫండ్ ఆర్డర్లను సాధించిందని డీసీపీ తెలిపారు. వీటి ద్వారా మొత్తం 1,04,17,082 రూపాయలను బాధితులకు తిరిగి చెల్లించనున్నట్లు చెప్పారు. ఇది సైబర్ నేరాలపై కఠిన చర్యలతో పాటు బాధితుల ఆర్థిక పరిరక్షణకు పోలీస్ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ దర్యాప్తులో కీలకంగా వెలుగులోకి వచ్చిన కేసుల్లో ఒకటిగా 22.80 లక్షల రూపాయల జాబ్ ఫ్రాడ్ కేసు ఉందని డీసీపీ వివరించారు. ఈ కేసులో నిందితులు ఒక ప్రముఖ ఎంఎన్‌సీలో సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బాధితుడి నుంచి 20,80,007 రూపాయలు తీసుకున్నారని తెలిపారు. నిందితుడు జాబ్ పోర్టల్ ఉద్యోగిలాగా నటిస్తూ దరఖాస్తు, ఇంటర్వ్యూ, ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారని, డబ్బు తీసుకున్న తర్వాత అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వకుండా, రీఫండ్ కూడా చేయకుండా పూర్తిగా స్పందించడం మానేశారని వివరించారు. ఈ కేసులో ప్రధాన నిర్వాహకుడైన పురుషోత్తం శర్మతో పాటు, కమిషన్ ఆధారంగా సిమ్ కార్డులు మరియు బ్యాంకు ఖాతాలు సరఫరా చేసిన కుల్దీప్ కుమార్, సునీల్ అనే ఇద్దరు ఢిల్లీకి చెందిన నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మోసపోయిన మొత్తాన్ని అనేక బ్యాంకు ఖాతాల కు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో సోషల్ మీడియా లేదా జాబ్ పోర్టల్స్ ద్వారా వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీసీపీ టి. సాయి మనోహర్ సూచించారు. ఉద్యోగ దరఖాస్తులు, ఇంటర్వ్యూలు లేదా అపాయింట్‌మెంట్‌ల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చెల్లించవద్దని, నిజమైన కంపెనీలు ముందస్తుగా రుసుములు వసూలు చేయవని గుర్తుంచుకోవాలని తెలిపారు. వ్యక్తిగత వివరాలు లేదా చెల్లింపులు చేసే ముందు అధికారిక వెబ్‌సైట్లు లేదా సంబంధిత హెచ్‌ఆర్ విభాగాల ద్వారా ధృవీకరణ చేసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

బాలానగర్ పీఎస్‌లో ‘స్ట్రోక్’పై అవగాహన సదస్సు
నిరంతరం ప్రజాసేవలో ఉండే పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్‌ఎన్‌సీ హాస్పిటల్ ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సి. రమేష్ సూచించారు. ఈరోజు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకు ‘స్ట్రోక్ (పక్షవాతం) – నివారణా మార్గాల’ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడి వారిని స్ట్రోక్ బారిన పడేలా చేసే ప్రమాదం ఉందని డాక్టర్ రమేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను వివరించారు.
స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే ప్రాథమిక సంకేతాలను ఎలా గుర్తించాలో వివరించారు. స్ట్రోక్ వచ్చిన మొదటి కొన్ని గంటలు అత్యంత కీలకమని, సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు. ఆహారపు అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం, సరైన విశ్రాంతి ద్వారా స్ట్రోక్ ముప్పును ఎలా అరికట్టవచ్చో వివరించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ సిఐ నర్సింహా రాజు మాట్లాడుతూ.. సిబ్బంది ఫిట్‌నెస్‌పై ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. ఈ సదస్సులో ఎస్ఐలు సరితా రెడ్డి, హాజీ మియా, వినోద్ కుమార్, జిన్నోవా బయోఫార్మ ప్రతినిధులు నవీన్, ప్రశాంత్, ఆర్‌ఎన్‌సీ హాస్పిటల్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.