ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర బుధవారం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది.
జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ క్షేత్రస్థాయిలో పర్యటించి జాతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతరకు తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారని తెలిపారు. ప్రకృతి సోయగాల మధ్య జరిగే ఈ జాతర భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుందని పేర్కొన్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందస్తుగా విస్తృత ఏర్పాట్లు చేపట్టిందన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరా, అన్నదానం, విశ్రాంతి మండపాలు, తాత్కాలిక నివాస సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు. భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను సమీక్షించారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను బలోపేతం చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
వైద్య సేవల పరంగా మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సదుపాయాలు సిద్ధంగా ఉంచి, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తెలియజేయాలని భక్తులను కలెక్టర్ కోరారు.
జాతర సమయంలో అధికారులు 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తారని, భక్తులు సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా పాల్గొనేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేస్తూ ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రద్దీ ప్రాంతాల్లో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.