- భారత్- పాక్‌ల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అవసరం లేదు.
- భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన బాధేస్తోంది.
- మీడియాతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రపంచ సమస్యగా మారిన ఉగ్రవాదాన్ని కూకుటి వేళ్లతో అణిచివేయాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.భారత్-పాక్‌ల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరమన్నారు. ఇతర దేశాల మధ్యవర్తిత్వంతో భారత్ స్ధాయి తగ్గుతుందని చెప్పారు. భారత్-పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు.ఆయన చొరవతోనే యుద్ధానికి బ్రేక్ పడిందని చెప్పడం బాధేస్తోందన్నారు.బుధవారం హైదరాబాద్‌లోని సీపీఎం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణలో అధికారంలో వచ్చిందని ఆరోపించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాట మారుస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు.ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్లు రేవంత్‌రెడ్డి వాగ్ధానాలు ఇచ్చారని అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రేవంత్‌రెడ్డికి తెలీదా? అని నిలదీశారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆపరేషన్ కగార్ ను ఆపడం శుభపరిణామం అని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు అన్నారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.