Take a fresh look at your lifestyle.

హస్తినలో పదవుల పంచాయితీ!

  • ఇప్పటికే కొలిక్కి వచ్చిన మంత్రివర్గ విస్తరణ.
  • కేబినెట్ లో చోటు కోసం అధిష్టానంపై ఆశావాహుల ఒత్తిడి.
  • ఏఐసీసీ చీఫ్, కేసీతో ఎస్సీ మాదిగ సామాజిక ఎమ్మెల్యేల భేటీ.
  • మంత్రివర్గంలో తమ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని ఆల్టీమేటం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చిన వేళ కాంగ్రెస్ హైకమాండ్ కు కొత్త తలనొప్పి వచ్చిపడింది. 18 నెలల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర కేబినెట్ లో ఖాళీగా ఉన్న ఆరు పోస్టులను భర్తీ చేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చిన అధిష్టానానికి ఆశావాహులు ఝలక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆరు పోస్టులకు 17 మంది పోటీ పడుతుండడంతో ఎవరి వైపు మొగ్గు చూపాలో తెలియక అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా మంత్రి పదవుల పంచాయతీ ఢిల్లీని చేరింది. తమ సామాజిక వర్గానికి కనీసం ఒక మంత్రి పదవి అయినా కేటాయించాలని మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏఐసీసీ అగ్రనేతలను కలిసి విన్నవించారు. ఆ మేరకు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, కవ్వం పల్లి సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావు గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అరగంటపాటు సమావేశమయ్యారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో తమ సామాజిక వర్గానికి తగిన అవకాశాలు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. మాదిగలు రాష్ట్రంలో గణనీయమైన జనాభా ఉన్న సామాజిక వర్గం కావడంతో, వారి రాజకీయ, సామాజిక ఆకాంక్షలను పరిగణించాలని కోరారు. అలాగే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నూ కలిసి అభ్యర్ధించారు. కాంగ్రెస్ హైకమాండ్ కేబినెట్ విస్తరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు కేటాయించాలని నేతలు అధిష్టానానికి తెలిపినట్టు సమాచారం. కాగా రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన సమయం ఇవ్వలేదు. దీంతో ఆయా ఎమ్మెల్యేలు నిరాశచెందారు. ఇదీలావుంటే రాష్ట్ర కేబినెట్ విస్తరణకు సంబంధించి టీపీసీసీ నేతలతో పలుమార్లు చర్చలు జరిపిన ఏఐసీసీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. అయితే కేబినెట్ పునఃవ్యవస్థీకరణలో మంత్రి పదవులు తమకు కావాలంటే తమకు కావాలని కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీకి క్యూకట్టారు. దీంతో అధిష్టానం ఆ నివేదికను పక్కన పెట్టేసింది. తాజాగా హస్తీనాకు చేరుకున్న మాదిగ కులానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ కులానికి కూడా కేబినెట్ లో పెద్ద పీట వేయాలని అధిష్టానంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కేబినెట్ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి ఎలాంటి అవకాశాలు దక్కుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

Leave A Reply

Your email address will not be published.