Take a fresh look at your lifestyle.

భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కారు

  • బలవంతంగా భూములను సేకరించే బాధ్యతలను రేవంత్ తన భుజాన వేసుకున్నారు.
  • బీద రైతుల కడుపుకొట్టి.. బడా పారిక్షామిక వేత్తలకు కారుచౌకగా కట్టబెడుతున్నారు.
  • ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో: బీద రైతుల కడుపుకొట్టి బడా పారిశ్రామిక వేత్తలకు భూములను కారుచౌకగా కట్టబెట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.తనకు నచ్చిన బడాబాబుల కోసం 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు.ఈ భూములను బలవంతంగా సేకరించే భాద్యతను సీఎం భుజాన వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అందుకే రైతులపై తరచుగా ప్రైవేటు వ్యక్తులు, పోలీసులు లాఠీలు ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. నిన్న జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ బౌన్సర్లతో పాటు పోలీసులు కూడా రైతులపై విచక్షణారహితంగా దాడి చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. పాలమూరు బిడ్డను అని పదేపదే చెప్పుకునే రేవంత్ రెడ్డి తన జిల్లాలోనే ఘటన జరిగి 24 గంటలు అవుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.పోలీసులు 12 గ్రామాల రైతులను కొట్టి, 40 మందిపై కేసులు పెట్టి, 12 మంది రిమాండ్ కి పంపించడం దుర్మార్గమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.రైతులను కొట్టించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యజమానిపై కానీ, బౌన్సర్లపై కానీ ఎందుకు కేసులు పెట్ట లేదో చెప్పాలని నిలదీశారు,.ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా రేవంత్ రెడ్డికి సోయి లేకుండా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో ఫార్మా కంపెనీని వ్యతిరేకించిన లంబాడా రైతులకు బేడీలు వేసిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తప్పుపట్టినా బుద్ధి రాలేదన్నారు.నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకించిన రైతులను కొట్టారన్నారు.సీఎం తన రియల్ ఎస్టేట్ దందాలు పెంచుకోవడానికి 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ విషయంలో కూడా రైతులపై కేసులు పెట్టిండు అని హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేఫార్మా సిటీ భూములు తిరిగిస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చి తిరిగి అదే రైతులపై కేసులు పెట్టడం శోచనీయమన్నారు.అలాగే జహీరాబాద్ న్యాలకల్ రైతులపై విచక్షణారహితంగా దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన ఘనత రేవంత్ సర్కార్ కే దక్కిందన్నారు. సూర్యాపేట జిల్లా చిలకలూరు గ్రామం రైతులు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే 42 మందిపై, ధాన్యం కోతలను ప్రశ్నించినందుకు నిర్మల్ జిల్లా ఏర్వచింత రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు.ఇంకా ఎన్ని రకాలుగా రైతులను గోసపెడుతావ్ రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.రైతులకు, ప్రజలకు పనికి వచ్చే ఒక్క పని చేయడం లేదు కానీ పెద్దలకు మాత్రం భూములను కట్టబెడుతావా అని మండిపడ్డారు.రైతులను కొట్టు కమిషన్లు పట్టు అనే విధంగా సాగుతుంది నీ పాలన సాగుతోందనన్నారు.తెలంగాణ రైతు లోకం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.అరెస్ట్ చేసిన పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన 12 మంది రైతులను వెంటనే విడుదల చేయాలని లేనిపక్షంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.