- ఇప్పటికే పర్యావరణహిత చర్యలు చేపడుతున్నాం.
- ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలి.
- ఒడిశాలోని నైనీ బొగ్గు గని ఏరియాలోనూ భారీగా మొక్కలు నాటుతాం.
- ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో సీఎండీ బలరామ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సింగరేణిలో ప్లాస్టిక్ వినియోగంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ఆ సంస్ధ సీఎండీ బలరామ్ ప్రకటించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా “ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుదాం” అనే నినాదం తీసుకున్నారని ఆయన వెల్లడించారు.దీనిని అనుసరిస్తూ సింగరేణి హైదరాబాద్ కార్యాలయంతో పాటు సింగరేణి లోని అన్ని ఏరియాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.ముఖ్యంగా ప్లాస్టింగ్ బాటిల్స్ను మొత్తానికే వినియోగించొద్దని స్పష్టం చేశారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఇప్పటికే పలు రకాల పర్యావరణహిత చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కొన్నిచోట్ల ప్లాస్టిక్ ను వాడటం మానేసినట్లు వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది ఇచ్చిన ప్రపంచ పర్యావరణ నినాదాన్ని అనుసరించి సింగరేణి కార్యాలయాలు, గనులు, డిపార్ట్ మెంటులలో ప్లాస్టిక్ తో తయారుచేసిన బాటిల్స్, ప్లేట్లు, వస్తువులు తదితరాలపై ఇక సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలోని అధికారులను, కార్మికులు,ఉద్యోగులు దీనికి సహకరించాలని కోరారు. తమ ఇంటి వద్ద కూడా ప్లాస్టిక్ వాడకాలను తగ్గించాలని సూచించారు. పర్యావరణం పట్ల అభిమానంతో తాను ఇప్పటికే సింగరేణి వ్యాప్తంగా 19 వేల మొక్కల్ని నాటినట్లు తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని సంస్థ డైరెక్టర్లు, ఇతర కార్మికులు కూడా మొక్కలు నాటడం ప్రారంభించారని ఇది ఎంతో సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరూ కనీసం మూడు మొక్కలు నాటాలని, ఆ ఆసక్తి ఉన్న వారికి సింగరేణి సంస్థ ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తుందని తెలిపారు.మూడు దశాబ్దాల క్రితం సింగరేణి ప్రాంతాల్లో ఎండాకాలం 50 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండేవన్నారు. సింగరేణి సంస్థ విస్తారంగా మొక్కలు నాటడంతో ఆ మొక్కలు అడవులుగా పెరిగి వాతావరణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ కు ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని ఉన్న అంగుల్ ప్రాంతంలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు స్థానికులు తెలియజేశారని చెప్పారు. అందుకే అక్కడ కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి సింగరేణి సంస్థ సంసిద్ధమవుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్ ) ఎస్ డీ ఎం.సుభాని, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ )ఎన్.వి. రాజశేఖర్ రావు, ఇంకా వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పర్యావరణం పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి ఛైర్మన్ బహుమతులు అందజేశారు. కార్యక్రమం లో పాల్గొన్న ఉద్యోగులకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు.
