ముద్ర :కాప్రా
ఉప్పల్ నియోజకవర్గంలో తాజాగా నెలకొన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రూ.116 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అయితే శంకుస్థాపన కార్యక్రమం జరిగిన మరుసటి రోజే అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేయడం సంచలనంగా మారింది.
ఇదివరకే ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, తాజా శిలాఫలకాల ధ్వంసం ఘటనతో మరోసారి ఆ ప్రాంతంలో ఆందోళన వాతావరణం ఏర్పడింది.
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించేలా ఇలాంటి చర్యలు జరగడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి, చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. మరోవైపు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.