Take a fresh look at your lifestyle.

దేశంలో హై అలర్ట్.. తెలంగాణలో ఆందోళన

 

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం అప్రమత్తం
మతపర అల్లర్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరిక
అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలకు కేంద్ర హోం శాఖ లేఖ
గూఢచారి విభాగాల మధ్య సమన్వయంపై దిశానిర్దేశం
హైదరాబాద్, కర్నాటక, ఢిల్లీ, యూపీలో నిరసనలపై ఆరా
హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు
ఇరాన్ లోని టెహ్రాన్, కుంలో 2వేల మంది తెలంగాణ విద్యార్ధులు, ఉద్యోగులు
అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి
జగిత్యాల జిల్లావాసుల భద్రతపై మంత్రి అడ్లూరి ఆందోళన

ముద్ర, తెలంగాణ బ్యూరో :

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ దాడులు, ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. యుద్ధవాతావరణం నేపథ్యంలో భారతదేశంలో మతపర అల్లర్లు జరిగే అవకాశం ఉందని అందువల్ల అలర్ట్ గా ఉండాలని ఈ మేరకు కేంద్ర హోం శాఖ రాష్ట్రాల పోలీసు శాఖలకు లేఖ రాసింది. ముఖ్యంగా మతపరమైన సభలు, ప్రార్థనా స్థలాలలో ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం అటువంటి వాటిపై నిఘా ఉంచాలని ఆదేశించింది. దేశీయంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, గూఢచారి విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు.. ఖమేనీ మృతికి నిరసనగా భారత్ లోని ముఖ్యమైన నగరాల్లో ఆదివారం భారీ నిరసన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్, కర్నాటక, ఢిల్లీ, యూపీతో పాటు పలు ముఖ్యమైన నగరాల్లో ఖమేనీ మృతిపై ప్రజలు నిరసన తెలిపారు. వీటిని ఆసరాగా చేసుకుని కొంత మంది హింసాత్మక ఘటనలకు దారి తీసేలా రెచ్చగొట్టే అవకాశం ఉందని, దీనిని అదుపు చేయాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగా జాగ్రత్త వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆదివారం రాత్రి ప్రధాని మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) సమీక్షించింది.

ఇరాన్ లో 2వేల మంది తెలంగాణ విద్యార్ధులు
ఇజ్రాయెల్, అమెరికా తమపై జరుపుతున్న దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. గల్ఫ్ కంట్రీస్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ ఇరు వర్గాల మధ్య జరుగుతున్న దాడులు భీకర స్థితికి చేరుకోవడంతో యుద్ధ ప్రభావిత దేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై తమ వారిలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో గల్ఫ్ దేశాల్లో ఉంటున్న తెలంగాణ వాసుల పట్ల వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఇరాన్‌లోని పలు నగరాల్లో ఒక్క తెలంగాణకు చెందిన 2 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో ఒక్క హైదరాబాద్ నగరం నుంచే 900 మంది ఆ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ సంయక్తంగా ఇరాన్‌పై దాడులు చేస్తుండగా.. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తోంది. మరోవైపు.. ఇంటర్నేషనల్ విమానాలు భారీగా రద్దు కావడంతో ఆ దేశంలో చిక్కుకుపోయిన వారు.. తిరిగి స్వదేశాలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. దీంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన తమ పిల్లల కోసం ఇక్కడ వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం ఇప్పుడు తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ వాసులను తీవ్రంగా భయపెడుతోంది. హైదరాబాద్‌కు చెందిన 900 మంది విద్యార్థులు ఇరాన్‌లోని టెహ్రాన్, కుం వంటి నగరాల్లో చదువుకుంటున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ రెండు రోజుల క్రితం జరిపిన ఆకస్మిక దాడితో అక్కడ ఉన్న తెలుగు వారు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ, టోలీచౌకి ప్రాంతాల్లోని విద్యార్థులను తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు, ఇంజనీర్లతోపాటు బిజినెస్‌మెన్‌లు తరచూ హైదరాబాద్ నుంచి ఇరాన్‌కు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ఇరాన్‌లో ఉన్న హైదరాబాదీలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇరాన్‌లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని అక్కడి ప్రభుత్వం ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయడంతో.. తమ వారి ఫోన్లు కూడా కలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్రమత్తంగా ఉండండి : సీఎం రేవంత్ రెడ్డి
ఇరాన్‌‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఇరాన్‌, గల్ఫ్‌ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దాడుల నేపథ్యంలో అక్కడి అధికారులు సూచించే భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. ఆ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు పాటించాలని తెలిపారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే తప్ప బయటకు రావద్దని హితవు పలికారు. ఇరాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో తాము సమన్వయం చేసుకుంటామని వివరించారు. పరిస్థితిని తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని చెప్పారు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రజలు ఎక్కువగా జీవనోపాధి కోసం దుబాయ్, ఖతార్, ఇరాన్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్లారన్న ఆయన ఆ దేశాల్లో చిక్కుకున్న జగిత్యాల ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.