99 రోజుల కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేయాలి -ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశంలో ఇంచార్జీ మంత్రి వివేక్
*వేసవిలో నీటి కష్టాలుండొద్దు
*అధికారులు ప్రజలతో మమేకం కావాలి
ముద్ర ప్రతినిధి, మెదక్
వేసవిలో త్రాగునీటి సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని
ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు.
అవసరమైన ప్రాంతాలలో బోర్ల రిపేర్లు, ప్రత్యామ్నాయ తాగునీరు సరఫరాకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
శుక్రవారం మెదక్ సమీకృత కలెక్టరేట్ లో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళికపై ఉమ్మడి (మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట) మెదక్ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ…అసెంబ్లీలో చర్చించి త్రాగునీరు సమస్య రాకుండా కావలసిన తాత్కాలిక పనుల కోసం అనుమతులు తీసుకుంటామన్నారు. నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు.
జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి. అధికారులంతా ప్రజలతో మమేకం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణలో ఉమ్మడి మెదక్ జిల్లా మొదటి స్థానంలో ఉండేలా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రజలతో మమేకమై వారితో కలిసి పనిచేసినప్పుడే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు అవకాశం ఉందని సీఎం భావించి ఈ కార్యక్రమంను తీసుకొచ్చారు. దీన్ని అమలుచేసే భాద్యత అధికారులదే అన్నారు. 10 అంశాలను ఆయా శాఖల ద్వారా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మించిన
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీనీ ప్రారంభించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానన్నారు. రెసిడెంటిల్ స్కూళ్లలో త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూడాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునేలా వారిని మానిటర్ చేయాలని ఆదేశించారు. గుమ్మడిదలలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సోలార్ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించే సూర్య ఘర్ యోజన పథకంపై రివ్యూ చేయాలన్నారు. ఏటిసిలు త్వరగా నిర్మాణం అయ్యేలా టిజీఐఐసి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో 6 గ్యారంటీలు ప్రజలకు పూర్తిగా అందేలా చూడాలని, నిర్మాణంలో ఉన్న
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులచే గృహప్రవేశాలు చేయించాలని అధిగారులకు సూచించారు. మన దేశ అవసరాలకు మించి వరి పంట దేశంలో పండుతుంది, రైతులు లబ్ధి పొందేలా 30% పంట మార్పిడి చేయించాలన్నారు. అధిక ఆదాయాన్ని సమకూర్చే ఆయిల్ ఫామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు. విద్యా, వైద్యం చాలా ముఖ్యం, పేద ప్రజలకు నాణ్యమైన విద్యా, వైద్య సేవలాందించాలన్నారు. రేషన్ కార్డులు, డిజిటల్ హెల్త్ కార్డ్స్ అర్హత ఉన్న పేదలందరికీ అందేలా చూడాలన్నారు.
కాలుష్యంపై దృష్టి పెట్టండి: ఎంపీ రఘునందన్ రావు

వివిధ నిర్మాణాలు, రహదారులు, పరిశ్రమలలో కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు. ప్లాస్టిక్ వ్యర్ధాల నుండి డీజిల్ ను తీసేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థకు సిద్దిపేట పట్టణంలో అర ఎకరం స్థలం కేటాయించాలని, ఆలాగే మెదక్, సంగారెడ్డిలో కూడా ఇవ్వాలన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
దుబ్బాక, రామాయంపేట, పటాన్చెరులో ఆర్డీఓ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, కొత్త మండలాలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలని ఇంచార్జి మంత్రిని కోరారు. ప్రతీ సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షా 25 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. రవాణా శాఖ డ్రైవింగ్ లైషన్స్ ఇచ్చేటప్పుడు రోడ్డు భద్రత నియమాలపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజల కోసం ప్రభుత్వం: ఎంపీ సురేష్ షెట్కార్

గ్రామ స్థాయిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ సురేష్ షెట్కార్ సూచించారు.
మహిళలకు హెల్త్ ప్రొఫైల్ చెక్ చేయాలని, వైద్య పోస్టులు భర్తీ చేయాలని, డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తు చేయాలన్నారు. రైతుల వివరాలు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ నమోదు చేసేలా చూడాలన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో డంపింగ్ యార్డ్ లు ఏర్పాటుచేయాలి. వాహనాలు అధికంగా నడిచే ప్రాంతాల్లో అండర్ పాస్ నిర్మించాలని, అపోజిట్ లో వాహనాలు వెళ్లకుండా కట్టుదిట్టంగా చర్యలు తీసుకువాలని, ఆయిల్ ఫామ్ అధికంగా సాగు చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒపీ ఫీజులు వసూలు చేయకుండా చూడాలన్నారు.
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నారు. పాల ఉత్పత్తులు పెంచాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు ఇవ్వోదన్నారు.
మెదక్ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. రామాయంపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పనులు ప్రారంభించాలన్నారు. జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
టిజిఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. బసవేశ్వర ప్రాజెక్ట్ పనులు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించాలన్నారు . భూములు కోల్పోయిన వారిని ఆదుకోవాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఆయిల్ ఫామ్ పంటలను అభివృద్ధి చేయాలన్నారు.
మెదక్ కలెక్టర్ ప్రతిమ సింగ్

మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తామన్నారు. జిల్లాలోని 2 నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో అధికారులను సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య మాట్లాడుతూ.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 15 తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే అధికారులు తమ తమ కార్యాలయాల్లో ఉన్న పెండింగ్ ఫైల్స్‌ను క్లియర్ చేస్తామన్నారు.
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి మాట్లాడుతూ.. అధికారులతో పాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిశీలించేందుకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ సమావేశంలో మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు, అదనపు కలెక్టర్లు నగేష్, మాధురి, అబ్దుల్ హమీద్, మెదక్ మున్సిపల్ చైర్మన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్లూ, మూడు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.