Take a fresh look at your lifestyle.

కలెక్టరేట్ ఎదుట బిజెపి సత్యాగ్రహ దీక్ష

  • ఎన్నికల ముందు కోతలు.. ఎన్నికల తర్వాత ఎగవేతలు.
  • రుణమాఫీ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదలచేయాలి.
  • రైతు బోనస్ ను బోగస్ ప్రక్రియగా మార్చారు.
  • దీక్షలో బిజెపి నేతలు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , గంగాడి కృష్ణారెడ్డి.

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, రైతు రుణమాఫీ, ఫసల్ బీమా యోజన అమలు, రైతు భరోసా, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు అన్నాడి రాజారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్లోని కలెక్టరేట్ వద్ద సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇట్టి దీక్షా కార్యక్రమానికిముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందన్నారు.ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు వాగ్దానాలు చేసిందన్నారు. ఎన్నికల ముందు కోతలు కోసిన రేవంత్ రెడ్డి, ఎన్నికల తర్వాత ఎగవేతల ను నమ్ముకొని , కుంటి సాకులతో రైతులకు ఇచ్చిన అన్ని హామీల్లో వాగ్దానాల్లో కోతలు పెడుతూ, రైతాంగాన్ని గోసపెడుతున్నారని మండిపడ్డారు. గత కెసిఆర్ ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేసినట్టే నేడు అంతకంటే దారుణంగా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకుంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మంది కూడా రుణమాఫీ చేయలేదన 70% మందికి ఎగ్గొట్టారని ఆరోపించారు.రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో తెలియజేయాలని, ఈ విషయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రైతు భరోసా విషయంలో కూడా రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు.ఎన్నికల ముందు రూ. 15వేలు ఇస్తామని , నేడు అధికారంలోకి వచ్చాక 12 వేలు ఇస్తామని మాట మార్చిందన్నారు.రైతు భరోసా నేటికీ చాలామంది రైతులకు రైతు పెట్టుబడి సాయం అందలేదని, కాలయాపనతో రైతులను తీవ్ర ఇబ్బంది గురిచేస్తుందన్నారు. అలాగే రైతు కూలీలకు 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని నేటికీ ఎంతమంది రైతు కూలీలకు సహాయం అందించారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. 14 పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేల్కొని, నేడు కేవలం ఒక సన్న వడ్లకే బోనస్ ఇస్తామని , ఆ అంశాన్ని పూర్తిగా బోగస్ ప్రక్రియగా మార్చిందన్నారు.రైతులకు తక్షణం బోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఎండలు మండిపోతుండడంతో, పంటలకు నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.సరిగ్గా నీటిని విడుదల చేయలేని పరిస్థితులు ఏర్పడడంతో రైతుల పంటలు ఎండిపోయి, నష్టపోయే పరిస్థితులు వచ్చాయన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల కారణంగా పంట నష్టపోయిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడటం లేదా.? రైతులను ఆదుకునే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో కేంద్రం ఇచ్చే సాయం రైతులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు.ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడం లేదని తెలిపారు.రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన లేదు, పంటల బీమా లేదు, రైతు బీమా అందడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ.2320 కనీస మద్దతు ధర నిర్ణయించి రైతులకు అండగా నిలుస్తుంది, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఉందన్నారు. క్వింటాలుకు కనీస, మద్దతు ధరతో పాటు హమాలీ చార్జెస్, ట్రాన్స్పోర్ట్ చార్జెలు, ఐకెపి సెంటర్లు, రైతు సంఘాలు, మార్కెట్ యార్డులకు కమిషన్, గోడౌన్ చార్జీలు, ప్రభుత్వ అధికారులకు చార్జీలు, వడ్ల బస్తాలకు, గన్ని బ్యాగులకు, సూతిల్ దారానికి అయ్యే ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందన్నారు.పంటను సక్రమంగా కొనుగోలు చేయాల్సిన అయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల సమయంలో అనేక ఆంక్షలు, కొర్రీలు పెడుతూ రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ, నష్టపెడుతుందన్నారు. రైతుల సమస్యల ను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం , నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదని, దొందు దొందేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వాగ్దానాలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు రైతుల పక్షాన బిజెపి నిరంతర పోరాటం కొనసాగిస్తుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉమ్మడి జిల్లా బిజెపి అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, యాదగిరి, కర్ర సంజీవ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభక్క మాజీ మేయర్ సునీల్ రావు, డి శంకర్, రాష్ట్ర నాయకులు బాస సత్యనారాయణ, గుగ్గిలపు రమేష్, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, కన్నెబోయిన ఓదెలు, బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్షులు మాడ వెంకట రెడ్డి , బత్తుల లక్మీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట రెడ్డి ,ఎర్రబెల్లి సంపత్ రావు , బొంతల కళ్యాణ్ చంద్ర, బింగి కరుణాకర్, అలు వేలి సమ్మిరెడ్డి, చొప్పరి జయశ్రీ, మడుగురి సమ్మి రెడ్డి, దుర్షెట్టి సంపత్,కటకం లోకేష్, ఏన్నం ప్రకాష్, బల్బీర్ సింగ్, పుప్పాల రఘు, నాంపల్లి శ్రీనివాస్, ప్రవీణ్, మహేష్, ఉప్పరపల్లి శ్రీనివాస్ తాజా మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, మోర్చల బాధ్యులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకుల తో పాటు రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.