ఎవరు పోటీ చేసినా నాపైనే సిద్ధిపేట ప్రజల ఆశీర్వాదం
రెండో సారి సీఎం.. రేవంత్ కల
ముద్ర, తెలంగాణ బ్యూరో :
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్ధిపేటలో తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. తనను ఓడించిన వారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పిన సీఎం వారిని వీరిని రంగంలో దింపకుండా ఆయనే స్వయంగా తనతో తలపడాలని ఛాలెంజ్ చేశారు. ఎవరు పోటీ చేసినా సిద్ధిపేట ప్రజల ఆశీర్వాదం తనపైనే ఉంటుందన్నారు. బుధవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి మళ్లీ తాను సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని చెప్పారు. కానీ ఆయన తల్లకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎప్పుడు, ఎలా గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసన్నారు. సమయం వచ్చినప్పుడు తమ సత్తా చాటుతామని హరీష్ రావు హెచ్చరించారు. . రేవంత్ రెడ్డికి ఇదే ఆఖరి టర్మ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమనీ కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రైతులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. పునర్విభజనతో బీఆర్ఎస్ పార్టీకే మేలు జరుగుతుందని విశ్లేషించారు. అయితే.. కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారంపై స్పందిస్తూ.. ఆయన వస్తారో లేదో చూడటమే బాగుంటుంది, ఇప్పుడే చెప్పడం కంటే వేచి చూడటం ఉత్తమం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.