క్లీన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ కూ నోటీసులు
కౌంటర్ దాఖలు చేయాలని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు
విచారణ వచ్చే నెల 16కు వాయిదా
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నది. పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర హైకోర్టు నోటీసులు ఇచ్చింది.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సైతం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ ఇచ్చిన తీర్పు పై బీఆర్ఎస్ హైకోర్టులో సవాల్ చేసింది. దానం నాగేందర్, అరికేపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం, బండ్ల కృష్ణమహన్‌రెడ్డి, తెల్లం వెంకట్రావులపై పిటిషన్ దాఖలైంది.. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరణతో కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. విచారణ వచ్చే నెల 16కు వాయిదా వేసింది. మరోవైపు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఇటీవల హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. దానం పార్టీ మారిన వ్యవహారంపై స్పీకర్ తీర్పును కొట్టేయాలని పిటిషన్‌లో ఏలేటి కోరారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన దానం.. కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు పోటీ చేశారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. కర్ణాటక, బిహార్‌లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా పార్టీ ఫిరాయింపుల కేసులో హైకోర్టు జోక్యం చేసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చే స్పందన, ఎమ్మెల్యేలు ఇచ్చే కౌంటర్ అఫిడవిట్లపై ఈ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుంది. న్యాయస్థానం ఈ సంచలన కేసు తదుపరి విచారణను వచ్చే నెల 16 కు వాయిదా వేయడంతో, అప్పటి వరకు ఈ ఉత్కంఠ కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కు, స్పీకర్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది.