ముద్ర ప్రతినిధి- నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా ఎక్స్‌రే యంత్రం పనిచేయకపోవడంతో చికిత్స కోసం వచ్చే సాధారణ రోగులు మాత్రమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాల బాధితులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.

జిల్లా ఆసుపత్రికి అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుండి నిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. అయితే వైద్య నిర్ధారణలో కీలకమైన ఎక్స్‌రే సేవలు అందుబాటులో లేకపోవడంతో, రోగులు తప్పనిసరిగా ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారికి అదనపు ఆర్థిక భారం పడుతోంది.
ఈ సమస్యపై ఆసుపత్రి అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. వెంటనే సమస్యను పరిష్కరించి ఎక్స్‌రే సేవలను పునరుద్ధరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.