తుంగతుర్తి నియోజకవర్గo జనరల్ గా మారుతుందా? ఎస్సీ రిజర్వ్ గా ఉంటుందా?
జనరల్ స్థానమైనా మహిళా రిజర్వేషన్ అయిన పోటీ తీవ్రంగా ఉండబోతుందా!
బి ఆర్ ఎస్ నుండి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాంగ్రెస్ నుండి ప్రస్తుత జిల్లా మంత్రి సతీమణి బరి లోకి దిగనున్నారా?
జనరల్ స్థానం అయితే ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉండనుందా?
జనరల్ గా అయితే తుంగతుర్తి నుండి పోటీకి జిల్లా మంత్రి రంగంలోకి?
తుంగతుర్తి జనరల్ స్థానం గా మారవచ్చనిఆశలు పెట్టుకున్న పలువురు ఆశావహులు.
ముద్ర…. తుంగతుర్తి…..
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరుగుతుందని అటు పార్లమెంటు నియోజక వర్గాలు ఇటు అసెంబ్లీ నియోజక వర్గాలు పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఆశావహుల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. ముఖ్యంగా గత నాలుగు పర్యాయాలు ఎస్సి రిజర్వుడుగా ఉన్న తున్నతుర్తి నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో 9 మండలాల విస్తీర్ణంలో కొనసాగుతున్నది.
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగితే ప్రస్తుతం ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం లోని 9 మండలాల్లో ఆరు మండలాలు ఒక నియోజకవర్గంగా ఇతర జిల్లాలో ఉన్న మూడు మండలాలు తో కలిపి మరో నియోజకవర్గంగా ఏర్పడుతుందని వదంతులు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా గత నాలుగు పర్యాయాలు ఎస్సి రిజర్వుగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గ జనరల్ గా మారుతుందని కొత్తగా ఏర్పడబోయే మరో నియోజకవర్గం రిజర్వుడుగా ఉంటుందని ఆశావహులు చర్చించుకుంటున్నారు. ఆశావహుల ఊహాగానాలే కనుక నిజమైతే తుంగతుర్తి నియోజకవర్గం జనరల్ స్థానంగా మారిన పక్షంలో ఒకవేళ మహిళా రిజర్వేషన్ బిల్లు పాసై పలు నియోజకవర్గాలు మహిళల కేటాయించిన పక్షంలో తుంగతుర్తి నియోజకవర్గం మహిళల కేటాయిస్తారా ?అనే చర్చ కూడా సాగుతోంది .
జనరల్ నియోజకవర్గంగా మారిన పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఆశావహులు బాగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా మంత్రి తన సొంత గ్రామం నియోజకవర్గ పరిధిలోనే ఉందని తుంగతుర్తి జనరల్ స్థానంగా మారినట్లయితే పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు పంపినట్లు సమాచారం .
బి ఆర్ ఎస్ నుండి చేయద్దు నియోజకవర్గం నాగారం వాసి గుంతకల్లు జగదీశ్ రెడ్డి అలాగే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ భర్త గుజ్జ యుగంధర్ రావు పోటీకి సిద్ధపడవచ్చని చర్చించుకుంటున్నారు మహిళా రిజర్వేషన్ అమలై మహిళల కేటాయించిన ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న సదరు మంత్రి సతీమణి తుంగతుర్తి నుండి రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నట్లు పలువురు రాజకీయ పండితులు చెప్తున్నారు .

అలాగే గత ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎలాంటి వివాదాలు లేకుండా కొనసాగిన తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామానికి చెందిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు బిఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగిన సమయం నుండి ప్రస్తుతం వరకు వీరికి కెసిఆర్, కేటీఆర్ ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఒకవేళ మహిళా రిజర్వేషన్ కాకుండా జనరల్ స్థానంగా కేటాయించిన పక్షంలో మాజీ మంత్రి అయిదు సార్లు శాసనసభ్యులుగా రెండుసార్లు మంత్రిగా మంచి పేరున్న దివంగత నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు ప్రస్తుత ఏఐసిసి మెంబర్ రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తిరిగి తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయడానికి బరిలోకి దిగడానికి తీవ్రంగా కృషి చేయవచ్చని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ నుండి తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు సంకినేని వెంకటేశ్వరరావు మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అంటున్నారు. అలాగే భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం పోటీకి ప్రయత్నించవచ్చని తెలుస్తోంది.

అలాగే మాజీ డిసిసి అధ్యక్షులు ప్రస్తుత రైతు కమిషన్ నెంబర్ బీసీలలో మంచి పట్టున్న నాయకుడు చెవిటి వెంకన్న యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న గుంతకండ్ల జగదీశ్ రెడ్డి సైతం తుంగతుర్తి మారతారా? లేక సూర్యాపేట రెండు నియోజకవర్గాలుగా విడిపోతే ఒకటి జనరల్ ఒకటి రిజర్వుడ్ గా ఉన్న పక్షంలో అక్కడ జనరల్ స్థానంలో పోటీ చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. సూర్యాపేట నియోజకవర్గం రెండుగా విడిపోతే జనరల్ స్థానం గా ఉన్న పక్షంలో అక్కడి నుండి పోటీ చేయవచ్చు అనే మాట వినవస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం జనరల్ గా మారిన పక్షంలో పోటీ తీవ్రంగా ఉండవచ్చని కాంగ్రెస్ ,బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నుండి పోటీ చేయడానికి అభ్యర్థులు తీవ్రంగా పోటీ పడవచ్చనేది విశ్వసనీయంగా తెలుస్తోంది .ఏది ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గం జనరల్ స్థానంగా మారిన పక్షంలో మహిళా రిజర్వేషన్ అమలవుతుందా ?లేక జనరల్ స్థానంలో ఉంటుందా? ఎస్సీ రిజర్వుడు గానే ఉంటుందా ?అనేది సైతం ఆశా వహులకు కొంత ఉత్కంఠత రేపుతోందని చెప్పవచ్చు .మరి రానున్న రోజులలో డీలిమిటేషన్ ప్రక్రియ వేగవంతం అయితే వచ్చే రెండున్నర సంవత్సరాలలో తిరిగి నియోజకవర్గంలో పట్టు సాధించడానికి ఏ నేతలు ఏ రకమైన రీతిలో నియోజకవర్గంలో పర్యటిస్తారు వేచి చూడాల్సి ఉంది. ముఖ్యంగా తుంగతుర్తి జనరల్ స్థానంగా మారితే తుంగతుర్తి, అరవపల్లి, నాగారం ,తిరుమలగిరి ,మద్దిరాల, నూతనకల్ మండలాలు ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. మరి పలువురు ఊహిస్తున్న ఊహగానాలు ఎంతవరకు నిజమవుతాయి. డీలిమిటేషన్లో తుంగతుర్తి ఏ విధమైన రిజర్వేషన్ ఉండబోతోంది? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.