ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 14 అర్జీలను స్వీకరించినట్లు సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను ఎస్పీ స్వయంగా విని, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
స్వీకరించిన అర్జీలలో భూమికి సంబంధించినవి 4, తగు న్యాయం కోరినవి 8, భార్యాభర్తల వివాదాలకు సంబంధించినవి 2 ఉండగా, వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్.ఐలు, సి.ఐలకు ఫోన్ ద్వారా వివరించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు నిర్భయంగా, ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించడం, శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.