Take a fresh look at your lifestyle.

చిన్నారుల విద్య, ఆరోగ్యమే ప్రధానం

  • అంగన్ వాడీల్లో సమూల మార్పులు.
  • అక్షర జ్ఞానం, పోషకాహారం, ఆరోగ్యం, ఆటవిడుపు, మేధో వికాసానికి కేంద్రాలుగా అంగన్వాడీలు.
  • ప్లే స్కూళ్లకు దీటుగా అభివృద్ధి.
  • చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులు.
  • వారంలో రెండు సార్లు ఎగ్ బిర్యానీ.
  • బడి గంట తరహాలో బెల్స్.
  • సెల్ఫీ విత్ అంగన్ వాడీ.
  • రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.

ముద్ర, తెలంగాణ బ్యూరో : అంగన్వాడి కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపుకు, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.ఆయా కేంద్రాలను ప్లే స్కూళ్లకు దీటుగా సిద్ధం చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు.చిన్నారుల చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.అంగన్వాడీలకు నమ్మకం కలిగించేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన మేధోమధన సదస్సులో సీతక్క మాట్లాడారు.ఇకపై అంగన్ వాడీ కేంద్రాల్లో వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మార్చబోతున్నట్లు ప్రకటించారు.అంగన్వాడీల్లో చిన్నారులకు అందిస్తున్న ఆహారపదార్థాలను మరింత రుచికరంగా మారుస్తామని చెప్పారు.చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న విద్యను, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడి కేంద్రాలకు బెంచీలు సరఫరా చేస్తామన్నారు.అంగన్వాడి టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్ ను త్వరలో అందజేస్తామని హామీ ఇచ్చారు.

  • బడి గంట తరహాలో..

అంగన్ వాడీ కేంద్రాల్లోనూ బడి గంట తరహాలో బెల్సును తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నామని సీతక్క తెలిపారు.ఇలా గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయని టీచర్లు, హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.మీ అనుభవాలు, ఆలోచనలు, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఆ శాఖ ఉద్యోగులు, అధికారులను ఉద్దేశించి చెప్పారు.మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్రోడీకరించి, నిపుణులు మేధావులతో చర్చించి అంగన్వాడీల సేవలను మరింత మెరుగుపరుస్తామన్నారు.తాము అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కారణంగా నియామకాల ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్నారు త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తామన్నారు.

  • సెల్ఫీ విత్ అంగన్ వాడీ.

అంగన్వాడీలు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సెల్ఫీ విత్ అంగన్వాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని హెచ్చరించారు. కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున వయోవృద్ధులకు, ట్రాన్స్ జెండర్ ల ఆత్మగౌరవాన్నీ పెంపొందించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలను ఒకే మోడల్ లో నిర్మించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.