Take a fresh look at your lifestyle.

కేసీఆర్  ఏం తప్పు చేశారు

  • కేసీఆర్  ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు ?
  • రాజకీయ దురుద్దేశంతో  నోటీసులు జారీ చేశారు.
  • కాళేశ్వరం పంప్ హౌజ్ ల పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ఎందుకు పిలవడం లేదు ?
  • బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి.
  • కాళేశ్వరానికి చిన్న పగుళ్లు ఏర్పడితేనే రంగంలోకి దిగిన ఎన్డీఎస్ఏ.. ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోతే ఎందుకు స్పందించడం లేదు ?
  • బనకచర్ల ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదు.
  • ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి  సీఎం, కిషన్ రెడ్డిలు  లేఖ రాయాలి.
  • కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ నేతలు జాతీయ హోదా సాధించాలి.
  • ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహా దీక్షలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 
ముద్ర,  తెలంగాణ బ్యూరో:  రాజకీయ దురుద్దేశంతోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు  కాళేశ్వరం కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.  ఆయన ఏం తప్పు చేశారని నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కు  నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లేనని అన్నారు.తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా? తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసము లేదని స్పష్టం చేశారు.కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం ఇందిరా పార్కు వద్ద మహా ధర్న జరిగింది. ప్రజలు, జాగృతి కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి కవిత మాట్లాడూతూ,  కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు. ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉన్నాయన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు కూడా ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చునని అన్నాపపు, కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చునని  వ్యాఖ్యానించారు.కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు అని అన్నారు.అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. 40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. మన పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు కూడా అందిస్తోందన్నారు. 90 మీటర్ల అడుగున ఉండే నీళ్లను 600 మీటర్లపైకి ఎత్తిపోసే ప్రాజెక్టు అన్నారు. కేసీఆర్ గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదని ఎద్దేవా చేశారు.తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని వ్యాఖ్యానించారు.
దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేసీఆర్ ను  బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారని గుర్తు చేశారు.మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మత్తులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పొలాలను ఎండబెడుతోందని ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తోందని ధ్వజమెత్తారు. 90 శాతం పంప్ హౌజ్ ల పనులు చేసిన కాంట్రాక్టర్ ను ఎందుకు వదిలేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు.తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రానికి ఫిర్యాదు చేయడం లేదని అడిగారు.గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదని మండిపడ్డారు. బీజేపీలో ఉన్న ఒకే ఒక తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్ కూడా మాట్లడకపోవడం శోచనీయమని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేసే బాధ్యతను ఈటల రాజేందర్ తీసుకోవాలని సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని తెలిపారు.గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు.
కాగా ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టిందన్నారు. నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారన్నారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టును కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారన్నారు. కాంగ్రెస్ నిర్మించిన పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు పైపులు పలిగిపోయాయన్నారు. ఎస్ఎల్బీసీ పనులు మొదలుపెడితే ప్రపంచం ముందు పరువు పోయేలా టన్నెల్ కూలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖం ని అద్దంలో చూసుకోవాలన్నారు. ఎస్ ఎల్ బి సి టనల్ కూలిపోతే ఎన్డీఎస్ఏ ఏం చేస్తున్నది.కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ బిజెపి పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టమైంది” అని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం లేకపోతే 35 శాతం తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉందని కాబట్టి తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టి పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 99% పనులు పూర్తయ్యాయని, మిగతా ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, కాబట్టి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని బిజెపిని డిమాండ్ చేశారు. బిజెపి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలని డిమాండ్ చేశారు. లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే దాదాపు 80000 కోట్ల వ్యయంతో అని, మరి లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగినట్లు? అని నిలదీశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు దాస్యం విజయభాస్కర్,  సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రావు, యువజన రాష్ట్ర అధ్యక్షులు సంపత్ గౌడ్, మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మరిపెల్లి మాధవి, విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు రాము యాదవ్, జాగృతి నాయకులు అప్పాల నరేందర్ యాదవ్, జాగృతి ఇటలి అధ్యక్షుడు తానింకి కిషోర్ యాదవ్, పబ్బోజు విజేందర్,  ఈగ సంతోష్, అర్చన సేనాపతి, మాడ హరీశ్ రెడ్డి, లలిత యాదవ్, పరకాల మనోజ్ గౌడ్, మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.