Take a fresh look at your lifestyle.

కవిత వ్యవహారం టీ కప్పులో తుఫాను

  • రాజకీయ ఉనికి కాపాడుకునేందుకు ఎమ్మెల్సీ కవిత పాట్లు.
  • ప్రజల చూపు తమ వైపు తిప్పుకునేందుకు కవిత ఫ్యామిలీ డ్రామాలు.
  • కవిత చెప్పిన పార్టీలో దెయ్యాలెవరో నాకు తెలియదు.
  • బీఆర్​ఎస్​ ఏమైపోతే మాకేంటీ.?
  • మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం టీ కప్పులో తుఫాను లాంటిదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కల్వకుంట్ల కుటుంబంతో పాటు కవిత డ్రామాలు ఆడటం మొదలు పెట్టారని మంత్రి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌ లోని గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమానికి మంత్రి పొన్నం హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత లేఖతో పాటు పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంత వరకు నిజమో తమకు తెలియదన్నారు. ఆ విషయాన్ని తాము ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏమైపోతే తమకెందుకని చురకలంటించారు. కేటీఆర్,కవిత పంచాయతీ కాంగ్రెస్ కు అవసరమే లేదని చెప్పారు. పార్టీలో అంతర్గతంగా నాయకత్వ వివాదం మొదలైందని మంత్రి చెప్పారు.దాన్ని ఆ పార్టీ, కేసీఆర్ తేల్చుకోవాలని సూచించారు.ఈ మధ్య బీఆర్ఎస్ నాయకులకు వార్తల్లోకి ఎక్కాలనే ఉబలాటం ఎక్కువైందని చురకలంటించారు. బీఆర్ఎస్‌లో విబేధాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.

  • గాంధీభవన్ దేవాలయం.

పార్టీ శ్రేణులకు గాంధీ భవన్ దేవాలయం లాంటిదని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు గాంధీ భవన్ కి వచ్చి సమస్యలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.గ్రామాల్లో హనుమంతుడి గుడి లేని ఊరు ఎలా ఉండదో అలానే..ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామం ఉండదని మంత్రి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బిఆర్ ఎస్ నేతలు పిల్లి శాపనార్థాలు పెట్టడం పరిపాటిగా మారిందని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.