- సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్
ముద్ర ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం: మే ఒకటో తేదీన ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఖమ్మం డివిజన్ వ్యాప్తంగా అన్ని కార్మిక వాడల్లో ఘనంగా నిర్వహించాలని సిపిఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. సోమవారం ఖానాపురం హవేలీ సిపిఐ(ఎం) పార్టీ ఆఫీసులో గొర్రెముచ్చు నాగేశ్వరావు అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో విక్రమ్ మాట్లాడుతూ ఈ పెట్టుబడిదారీ సమాజంలో కార్మికులు పని ఒత్తిడి తట్టుకో లేక, వేతనాలు సరి పోక, తాము చేస్తున్న ఉద్యోగానికి, ఉపాధికి భద్రత లేక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని, వారిని ఆదుకొని కార్మిక హక్కులను, చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోక పోగా ఉన్న చట్టాలకు తూట్లు పొడిచి కార్మిక వ్యతిరేక విధానాలను నిస్సిగ్గుగా అమలు చేస్తున్నాయని విమర్శించారు.మరో పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి కార్మికులపై ముప్పేట దాడి చేస్తున్నాయని, భవిష్యత్తులో కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.కారల్ మార్క్స్ చెప్పిన ‘ ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే నినాదంతో మే డే స్ఫూర్తితో కార్మికులంతా మే ఒకటో తారీఖున కార్మిక జెండాలను ఎగర వేయాలని కోరారు.ఈ సమావేశంలో హవేలీ మండల కార్యదర్శి దొంగల తిరుపతి రావు, మండల కమిటీ సభ్యులు గాలి వెంకటాద్రి, పోతురాజు వెంకటి, తిప్పర్తి నరసింహా రావు, వంగూరి రమ, దంతాల నరసింహా రావు, జట్ల ఆనంద రావు, అమరబోయిన అంజని, చారు ప్రసాద్, మంగమ్మ, నాగమణి, నల్లమల సత్యనారాయణ, మాచర్ల గోపాల్, వేదగిరి మురహరి తదితరులు పాల్గొన్నారు.