Take a fresh look at your lifestyle.

తెలంగాణ విద్యాభివృద్ధికి సింగరేణి తోడ్పాటు

  • ఓయూకు సహకారం గర్వకారణం.
  • సింగరేణి సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ఈ సీ ఈ  భవంతి ప్రారంభం.
  • సింగరేణి సీఎండీ బలరామ్.

 ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రాంత విద్యాభివృద్ధికి సింగరేణి పూర్తి సహకారం అందిస్తోందని ఆ సంస్ధ సీఎండీ బలరామ్ ప్రకటించారు. వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో తరగతి గదుల నిర్మాణానికి సహకరించడం తమ సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పారు.ఆదివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ శాఖ లో దాదాపు రూ.2 కోట్ల సింగరేణి సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన తరగతి గదుల కాంప్లెక్స్ ను ఆయన యూనివర్సిటీ ఉప కులపతి  శ్రీ కుమార్ మొలుగారం తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలో ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించడానికి కూడా పూర్తిస్థాయిలో సహకరించిందని చెప్పారు.ప్రస్తుత ఉస్మానియాలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో సింగరేణి తరఫున అధ్యాపకులను కేటాయించిందని, ప్రొఫెసర్ ఛైర్ పథకం కింద నిధులు కూడా కేటాయించిన విషయాన్ని సీఎండీ గుర్తుచేశారు.ఇవే కాకుండా పెద్దపల్లి జిల్లాలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి శ్రీ కుమార్ మొగులారం మాట్లాడుతూ 13 దశాబ్దాల చరిత్ర గల సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమన్నారు.ఉస్మానియా యూనివర్సిటీకి సింగరేణి అందించిన ఆర్థిక సహాయం మరువలేనిదన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ బోధన తిరిగి ప్రారంభించేందుకు కూడా పూర్తి సహకారం అందించిందని కొనియాడారు. ఇకపై కూడా సింగరేణి తన సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్, ఈసీఈ విభాగ అధిపతి ప్రొఫెసర్ డి.రామకృష్ణ, సింగరేణి అధికారులు ఎన్.భాస్కర్,  జి.రమేశ్,  సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.