Take a fresh look at your lifestyle.

వంగూర్ మండలంలో ఏటీసీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన అనువైన భూమి కేటాయింపుకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
కొండారెడ్డిపల్లి గ్రామంలో ఏటీసీ ఏర్పాటు కోసం అనువుగా ఉన్న భూమిని ప్రత్యక్షంగా సందర్శించిన కలెక్టర్, స్థల పరిమాణం, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల లభ్యత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను భూమికి సంబంధించిన రికార్డులు, యాజమాన్య వివరాలు, అందుబాటులో ఉన్న విస్తీర్ణం వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఖరారు చేయడంలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అవసరమైన మార్గదర్శకాలను తక్షణమే విడుదల చేయాలని, భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని వంగూర్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
అన్ని పరిపాలనా అనుమతులను త్వరగా పూర్తి చేసి, ఫైళ్లను ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఏటీసీ భవన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ప్రాంతీయ యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడంతో పాటు డిజిటల్, టెక్నికల్ రంగాల్లో నైపుణ్యాలు పెంపొందే అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ వెంట కల్వకుర్తి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రిన్సిపల్, మండల తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.